తెలుగు క్లాసిక్ ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు. చివరగా డిసెబరు 31న విడుదలకు సన్నాహాలన్నీ పూర్తయ్యాక కరోనా మూడో వేవ్ ఉద్ధృతి పెరగడంతో రిలీజ్2కు ఇంకో మూడు రోజులుండగా సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 14కు కొత్త డేట్ ఎంచుకున్నారు. ఇదే తేదీకి ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ లాంటి క్రేజీ మూవీ వస్తున్నప్పటికీ.. తమ సినిమా మీద నమ్మకంతో ఉన్నారు జెర్సీ మేకర్స్.
రిలీజ్ డేట్ ఇంకోసారి ఖరారు చేసి ముందుకెళ్లడానికే సిద్ధపడ్డారు. కొన్ని చోట్ల బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఐతే రెస్పాన్స్ అంత బాగా ఏమీ లేదు. అదే సమయంలో ‘కేజీఎఫ్-2’కు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. హిందీ బెల్ట్‌లో పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. దీంతో ‘జెర్సీ’ మేకర్స్‌లో కంగారు తప్పలేదు. ‘పుష్ప’ దెబ్బకు ‘83’.. ‘ఆర్ఆర్ఆర్’ ధాటికి ‘ఎటాక్’ ఎలా అల్లాడిపోయాయో చూశాక.. ఇగోకు పోయి రిలీజ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని భయపడ్డట్లున్నారు ‘జెర్సీ’ నిర్మాతలు.
ఈ నెల 14 నుంచి 21కి ‘జెర్సీ’ని వాయిదా వేస్తూ ఈ చిత్ర నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. సినిమాను ఇంత కాలం ఆపి ‘కేజీఎఫ్-2’కు బలి ఇవ్వడం ఎందుకనే వెనక్కి తగ్గారన్నది స్పష్టం. పదుల కోట్లు ముడిపడ్డ విషయంలో ఇగోకు వెళ్లడం కరెక్ట్ కాదనుకున్నారు ‘జెర్సీ’ మేకర్స్. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని వారం రోజులే వాయిదా వేశారు. ‘కేజీఎఫ్-2’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూసి ఇంకో వారం సినిమాను వాయిదా వేసినా ఆశ్చర్యం లేదేమో.
‘జెర్సీ’ హిందీ నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు కావడం విశేషం. అలాగే ‘జెర్సీ’ ఒరిజినల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీకి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. వీరితో కలిసి అమన్ గిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో నాని, శ్రద్ధ శ్రీనాథ్ చేసిన పాత్రలను అక్కడ షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ పోషించారు. తెలుగు వెర్షన్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ డైరెక్ట్ చేశాడు. షాహిద్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాగే ‘జెర్సీ’ కూడా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే భరోసా ఉన్నప్పటికీ రిలీజ్ టైమింగ్ తేడా కొట్టకూడదనే సినిమాను వాయిదా వేశారన్నది స్పష్టం.