ఆర్ఆర్ఆర్.. ఆ అద్భుతాన్ని అందుకుంది

ఒక ఇండియన్ సినిమా రాబోయే పదేళ్లలో వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని ఎవరైనా.. ఓ పదేళ్ల ముందు అని ఉంటే నవ్వుకునేవాళ్లేమో. అప్పటికి భారతీయ చిత్రాలేవీ 500 కోట్ల వసూళ్లు కూడా సాధించింది లేదు. అలాంటిది ‘బాహుబలి’ వచ్చాక లెక్కలన్నీ మారిపోయాయి. ‘బాహుబలి: ది బిగినింగ్’ వరల్డ్ వైడ్ రూ.500 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఔరా అనిపిస్తే.. ‘ది కంక్లూజన్’ అంతకు మూడు రెట్లకు పైగానే కలెక్ట్ చేసి సంచలనం రేపింది.

మరోవైపు ఆమిర్ ఖాన్ సినిమా ‘దంగల్’ చైనా వసూళ్లతో కలిపి ఏకంగా రూ.2 వేల కోట్ల గ్రాస్ మార్కునూ దాటేసి అబ్బురపరిచింది. ఐతే ఇవి ఇలా అలవోకగా వెయ్యి కోట్ల మార్కును దాటేశాయని.. ఆ తర్వాత వచ్చిన భారీ సినిమాలన్నీ ఇరగాడేయలేదు. వీటి స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. ‘బాహుబలి-2’ తర్వాత ఏ ఇండియన్ సినిమా కూడా కనీసం రూ.500 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. ఐతే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ ‘బాహుబలి’కి దీటుగా వసూళ్లు రాబట్టి రాజమౌళి సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది.

‘బాహుబలి’ స్థాయిలో ఇండియా అంతటా హైప్ లేకపోయినా.. సినిమాకు కొంత మేర డివైడ్ టాక్ కూడా వచ్చినా తట్టుకుని నిలబడ్డ ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌లో రూ.1000 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. భారతీయ చిత్రాల్లో బాహుబలి: ది కంక్లూజన్, దంగల్ తర్వాత వెయ్యి కోట్ల మార్కును అందుకున్న మూడో చిత్రమిది. ఈ జాబితాలో ‘దంగల్’ను కాస్త వేరు చేసి చూడాలి. మామూలుగా అయితే ఆ చిత్రం ఫస్ట్ రిలీజ్‌లో వరల్డ్ వైడ్ రూ.800 కోట్లకు చేరువగా గ్రాస్ వసూళ్లే రాబట్టింది. కానీ కొన్ని నెలల తర్వాత చైనాలో ప్రత్యేకంగా రిలీజ్ చేస్తే అక్కడ అనూహ్య స్పందన తెచ్చుకుంది. అక్కడ వసూళ్లు రూ.1200 కోట్లు దాటిపోయాయి. అలా ఇది రూ.2 వేల కోట్ల గ్రాస్ మార్కును అందుకోగలిగింది.

‘బాహుబలి: ది కంక్లూజన్’ ఫస్ట్ రిలీజ్‌లోనే వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. కొంచెం గ్యాప్‌లో చైనాలో రిలీజ్ చేశారు. అక్కడ ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా వసూళ్లు రూ.1700 కోట్ల మార్కును దాటాయి. ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతానికి ఫుల్ రన్లో రూ.1200 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత ఇంటర్నేషనల్ కట్‌తో చైనా సహా పలు దేశాల్లో రిలీజ్ చేసే ప్లాన్లో చిత్ర బృందం ఉంది. అదంతా కూడా అయ్యాక ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.