రేవ్ పార్టీపై యువ హీరో రియాక్షన్

హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం రేపిన రేవ్ పార్టీ వ్య‌వ‌హారంలో తెలుగుదేశం ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు, మ‌హేష్ బాబు మేన‌ల్లుడు అయిన గ‌ల్లా అశోక్ పేరు కూడా వినిపించ‌డం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని ప‌బ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్న వారిలో అశోక్ కూడా ఉన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. ఐతే ఈ ప్ర‌చారాన్ని కొన్ని గంట‌ల్లోనే గ‌ల్లా కుటుంబం ఖండించింది.

అశోక్‌కు ఈ వ్య‌వ‌హారంతో సంబంధ‌మే లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. అయినా స‌రే ఈ ప్ర‌చారం ఆగ‌లేదు. ఈ నేప‌థ్యంలో గ‌ల్లా అశోక్ స్వ‌యంగా మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చాడు. ఏప్రిల్ 5న త‌న పుట్టిన రోజు నేప‌థ్యంలో మీడియాను క‌లిసిన అత‌ను.. ఈ రేవ్ పార్టీ గొడ‌వ‌పైనా మాట్లాడాడు. ప‌బ్ ఇష్యూలో మీ పేరు కూడా వినిపించింది. అప్పుడెలా అనిపించింది అని మీడియా వాళ్లు ప్ర‌శ్నించ‌గా.. ‘‘ఆరోజు రాత్రి నేను ఫిజియో థెర‌పీ చేయించుకుంటున్నాను. సడన్‌గా వార్త‌ల్లో నా పేరు ఎలా వ‌చ్చిందో తెలీదు. అప్పుడు నిజంగా నాకు హీరో అనే ఫీలింగ్ కలిగింది. సెల‌బ్రిటీ లైఫ్‌‌లో ఉంటే ఇలానే రూమర్లు వ‌స్తుంటాయ‌నిపించింది అని అశోక్ తెలిపాడు.

ఇక త‌న కెరీర్ గురించి అశోక్ మాట్లాడుతూ.. తొలి చిత్రం హీరో పూర్తి సంతృప్తినివ్వ‌లేద‌న్న‌ట్లు మాట్లాడాడు. క‌రోనా కార‌ణంగా సంక్రాంతి టైంలో థియేట‌ర్ల‌కు రావాల్సిన స్థాయిలో క్రౌడ్ రాలేద‌ని, దాని వ‌ల్ల సినిమాకు కొంత న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పాడు.

ఐతే ఈ సినిమా న‌టుడిగా త‌న‌కు మంచి అనుభ‌వం అని, హీరో చూసిన మ‌హేష్ బాబు తన‌ను చూసి గ‌ర్విస్తున్న‌ట్లు చెప్పాడ‌ని.. త‌ర్వాత ఇంకేవో మాట‌లు అన్నా కూడా ఆ ఒక్క మాట ద‌గ్గ‌ర తాను ఆగిపోయాన‌ని అశోక్ చెప్పాడు. మ‌హేష్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వ‌స్తే మురారి మూవీ చేయాల‌నుకుంటున్న‌ట్లు అశోక్ తెలిపాడు.