ద‌ర్శ‌కుడే ఓటీటీలో వ‌దిలేయ‌మ‌న్నాడ‌ట కానీ..

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడు కావాల‌న్న క‌ల నెర‌వేర్చుకోవాలంటే మామూలు విష‌యం కాదు. అందుకు ఏళ్ల‌కు ఏళ్లు నిరీక్షించాలి. ఎంతో శ్ర‌మించాలి. చాలామందిని మెప్పించాలి. ఒప్పించాలి. ఇవ‌న్నీ జ‌రిగి ద‌ర్శ‌కుడిగా తొలి అవ‌కాశం అందుకున్నాక కూడా ఏదో ఒక అడ్డంకి ఎదురు కావ‌చ్చు. ఆ అడ్డంకి క‌రోనా రూపంలో ఎదురైతే అది మామూలు క‌ష్టం కాదు. ఒక కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన‌ సినిమా రెండుసార్లు, మూడుసార్లు కాదు.. ఏకంగా ఏడుసార్లు వాయిదా ప‌డితే అత‌డి ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంచ‌నా వేయొచ్చు.

గ‌ని సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ ప‌రిస్థితే ఎదుర్కొన్నాడు. గ‌త ఏడాది వేస‌విలోనే విడుద‌ల కావాల్సిన ఈ సినిమా ప‌లుమార్లు వాయిదా ప‌డి ఈ నెల 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. మామూలు ప్రేక్ష‌కులు లెక్క‌పెట్ట‌లేదేమో కానీ.. ఈ చిత్రం మొత్తం ఏడుసార్లు వాయిదా ప‌డిన‌ట్లు లెక్క‌పెట్టి మ‌రీ చెబుతున్నాడు కిర‌ణ్‌.

తన సినిమా రిలీజ్ నేప‌థ్యంలో మీడియాను క‌లిసిన కిర‌ణ్‌.. క‌రోనా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల గ‌ని ఇన్నిసార్లు వాయిదా ప‌డ్డ నేప‌థ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడాడు. సినిమా ఇంత ఆల‌స్య‌మ‌య్యేస‌రికి తాను చాలా ఒత్తిడి ఎదుర్కొన్నాన‌ని, నిర్మాత‌ల‌కు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేయ‌మ‌ని త‌నే సూచించిన‌ట్లు కిర‌ణ్ వెల్ల‌డించాడు. కానీ సినిమా మీద ఉన్న న‌మ్మ‌కంతో, ఇలాంటి చిత్రం థియేట‌ర్ల‌లోనే రిలీజ్ కావాల‌న్న ఉద్దేశంతో ఇంత కాలం నిర్మాత‌లు ఆగార‌ని కిర‌ణ్ చెప్పాడు.

రేప్పొద్దున సినిమా చూసిన ప్రేక్షకులు ఇది థియేట‌ర్ల‌లో రిలీజ్ కావాల్సిన సినిమానే అని ఒప్పుకుంటార‌ని అత‌న‌న్నాడు. వ‌రుణ్ న‌టించిన‌ తొలి ప్రేమ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ విభాగంలో తాను ప‌ని చేశాన‌ని.. అప్పుడే త‌న ప్ర‌తిభ‌ను గుర్తించి సినిమా చేస్తాన‌ని వ‌రుణ్‌ హామీ ఇచ్చాడ‌ని, త‌ర్వాత ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాడ‌ని, స్పోర్ట్స్ డ్రామా చేయాల‌ని వ‌రుణ్ చెప్పాక బాక్సింగ్ నేప‌థ్యంలో గ‌ని క‌థ‌ను రాసిన‌ట్లు కిర‌ణ్ వెల్ల‌డించాడు