ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది హఠాత్తుగా సినిమా టికెట్ల ధరలు తగ్గించేయడంతో పాటు టికెట్ల అమ్మకాలకు కొత్తగా ప్రభుత్వం తరఫున ఆన్ లైన్ టికెటింగ్ యాప్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిగాక.. ఇటీవలే టికెట్ల ధరలను ఓ మోస్తరుగా పెంచింది ప్రభుత్వం. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ కోసం యాప్ కూడా రెడీ అయినట్లే.
కాకపోతే ముందు అన్నట్లు ప్రభుత్వం తరఫున కొత్త యాప్ సిద్ధం కావట్లేదు. ఓ ప్రైవేటు ఏజెన్సీకే ఈ బాధ్యతను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. టెండర్ ప్రక్రియ ద్వారానే ఈ సంస్థను ఎంపిక చేశారు. ఇప్పటికే పాపులర్ అయిన జస్ట్ టికెట్స్ సంస్థ ఇకపై ఏపీలో టికెట్ల అమ్మకాలు చేపట్టనుంది. అక్కడ బుక్ మై షో సహా వేరే యాప్స్ ఏమీ ఉండవు. పూర్తిగా ఈ ఒక్క యాప్ నుంచే టికెట్ల అమ్మకాలు జరుగుతాయి.
కౌంటర్ బుకింగ్ కోసం కొంత శాతం టికెట్లను పక్కన పెడతారా.. లేక పూర్తిగా ఈ యాప్ ద్వారానే అమ్మకాలు జరుగుతాయా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీలను కొంత తగ్గించి తక్కువ కమిషన్‌తో జస్ట్ టికెట్స్ సంస్థ టికెట్ల అమ్మకాలు చేపట్టనుంది. ఈ సంస్థలో అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ భాగస్వామిగా ఉండటం విశేషం.
గతంలో బాబీ టికెట్ అడ్డా పేరుతో యాప్ నడిపేవాడు. తర్వాత దాన్ని జస్ట్ టికెట్స్ కొనుగోలు చేసింది. దీంతో బాబీ ‘జస్ట్ టికెట్స్’లో భాగస్వామిగా మారాడు. అతడితో పాటు సంస్థలో ఇంకో నలుగురు డైరెక్టర్లు ఉన్నారు. కాబట్టి ఇది ఏపీలో టికెట్ల అమ్మకాలు పూర్తిగా అల్లు బాబీ చేతుల్లోకి వచ్చేశాయని, దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని.. అందుకోసం ఆయన లాబీయింగ్ చేశాడని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఇప్పటికే ఈ రకమైన ప్రచారం మొదలైపోయింది సోషల్ మీడియాలో. టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై చిరు రాజీ లేకుండా, అలుపెరగకుండా చేసిన పోరాటాన్ని కూడా ఇప్పుడు తగ్గించే ప్రయత్నం జరగొచ్చు. కానీ అది వాస్తవం కాదని సామాన్య జనం అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.