చైతూతో వెంకట్ ప్రభు.. కానీ ట్విస్టేంటంటే?

వరుస విజయాలతో ఊపుమీదున్న అక్కినేని నాగచైతన్య ఈ సంక్రాంతికి ‘బంగార్రాజు’తో ఇంకో హిట్టు కొట్టాడు. దీని తర్వాత అతడి నుంచి ‘థ్యాంక్ యు’ అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీని తర్వాత చైతూ సినిమా ఏదనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది.

ప్రస్తుతానికి అతను విక్రమ్ దర్శకత్వంలోనే ‘దూత’ అనే హార్రర్ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యాక తమిళ దర్శకుడు విక్రమ్ ప్రభుతో ఓ సినిమా అంటూ ఇంతకుముందు ప్రచారం జరిగింది. వెంకట్ తమిళంలో రూపొందించిన హిట్ మూవీ ‘మానాడు’నే వీళ్లిద్దరూ కలిసి రీమేక్ చేస్తున్నారని వార్తలు రావడం కూడా తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటిదాకా రాలేదు.

ఐతే ఇప్పుడు స్వయంగా వెంకట్ ప్రభునే ఓ తమిళ ఇంటర్వ్యూలో చైతూతో తన సినిమాను కన్ఫమ్ చేశాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు నుంచి ‘మన్మథ లీల’ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తర్వాతి సినిమా గురించి అడిగితే.. టాలీవుడ్ స్టార్ నాగచైతన్యతో తానో సినిమా చేయబోతున్నట్లు ధ్రువీకరించాడు వెంకట్ ప్రభు. ఐతే ఇది రీమేక్ కాదని అతను స్పష్టం చేశాడు. ఒక కొత్త కథతోనే ఈ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. తాను తమిళ దర్శకుడిని కాబట్టి తమిళ మార్కెట్‌ను కూడా ఉపయోగించుకుందామని అనుకుంటున్నారని.. కాబట్టి ఇది ద్విభాషా చిత్రంగానే తెరకెక్కుతుందని వెంకట్ ప్రభు ధ్రువీకరించాడు.

ఇంతకుమించి తానీ ప్రాజెక్టు గురించి మాట్లాడలేనని, త్వరలోనే కాస్ట్ అండ్ క్రూ గురించి చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేస్తుందని వెంకట్ తెలిపాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుందట. ‘ఒక లైలా కోసం’ తర్వాత చైతూ-పూజ కలిసి నటించనున్న సినిమా ఇదే. ఏప్రిల్ తొలి వారంలో ఈ సినిమా మొదలవుతుందని సమాచారం.