జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మెగా కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుండగా.. BoycottRRR అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే ఇలాంటి నెెగెటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు.
ఈ చిత్రంలో ఎవరినైనా కించపరిచే, ఎవరి మనోభావాలైనా దెబ్బ తీసే సన్నివేశాలు ఉన్నాయేమో అన్న సందేహాలు కలగొచ్చు. ఐతే ఇక్కడ వ్యవహారం వేరు. ఈ ట్రెండ్‌లో భాగస్వాములు అవుతున్నది కన్నడిగులు కావడం గమనార్హం. ‘ఆర్ఆర్ఆర్’ను కన్నడలో రిలీజ్ చేయకపోవడమే వారి ఆగ్రహానికి కారణం. ‘ఆర్ఆర్ఆర్’ ప్రోమోలను కన్నడలో రిలీజ్ చేసి, కర్ణాటకకు వెళ్లి పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేసి.. చివరికి కన్నడ వెర్షన్‌ను రిలీజ్ చేయకపోవడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ఐతే పాన్ ఇండియా సినిమాల విషయంలో ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటమే కన్నడిగుల ఆగ్రహానికి కారణం. గత ఏడాది చివర్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రాన్ని కూడా కర్ణాటకలో చాలా వరకు తెలుగులోనే రిలీజ్ చేశారు. కన్నడ వెర్షన్ ఏదో నామమాత్రంగా విడుదలైంది. అప్పుడు కూడా కన్నడిగులు ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఈ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసేది కన్నడిగులే. థియేటర్లూ వాళ్లవే. డిమాండును బట్టే ఏదైనా జరుగుతుంది.
బెంగుళూరు సహా కర్ణాటకలోని పెద్ద సిటీల్లో తెలుగు వాళ్లు ఎక్కువ. తెలుగు వెర్షన్‌కే డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్లే స్క్రీన్లు, షోలు కేటాయిస్తున్నారు. కానీ ‘పుష్ఫ’ సంగతెలా ఉన్నప్పటికీ.. ‘ఆర్ఆర్ఆర్’ స్థాయి పెద్దది కాబట్టి కన్నడలో దానికి ఓ మోస్తరుగా అయినా స్క్రీన్లు ఇవ్వాల్సింది. కానీ బుక్ మై షో తెరిస్తే.. బెంగళూరు సిటీలో అసలు కన్నడ వెర్షన్ ఆప్షనే చూపించట్లేదు. ఇదే కన్నడిగుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను బహిష్కరించాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఇక జెట్ స్పీడ్ లోనే ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. RRR ను కన్నడలో విడుదల చేస్తున్న KVN ప్రొడక్షన్ సంస్థ స్పందించి ఎక్కువ థియేటర్సలో కన్నడ వెర్షన్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.