RRRను త‌గ్గించే ప్ర‌య‌త్నం?

బాహుబ‌లిః ది బిగినింగ్ రిలీజైన‌పుడు మొద‌ట్లో ఉత్త‌రాదిన ఇదేమీ సెన్సేషన్ క్రియేట్ చేసేయ‌లేదు. విడుద‌ల ముంగిట కొంత‌మేర ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించిన‌ప్ప‌టికీ.. దాని అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ ఓ మోస్త‌రుగానే క‌నిపించాయి. కానీ త‌ర్వాత సినిమా ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఇక బాహుబ‌లిః ది కంక్లూజ‌న్‌కు వ‌చ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఆ చిత్రాన్ని రాజ‌మౌళి బృందం ప‌నిగ‌ట్టుకుని ప్ర‌మోట్ చేయాల్సిన అవ‌స‌రం కూడా లేక‌పోయింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల‌న్న క్యూరియాసిటీతో సినిమాను ఎగ‌బ‌డి చూశారు.

బాలీవుడ్ మీడియా కూడా అనివార్యంగా ఆ సినిమాను మోయాల్సి వ‌చ్చింది. మ‌రే సౌత్ సినిమాకూ ఇవ్వ‌ని క‌వ‌రేజీ, ప్ర‌శంస‌లు ఆ సినిమాకు బాలీవుడ్ మీడియా నుంచి ద‌క్కాయి. ఐతే త‌న కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్‌కు కూడా బాలీవుడ్ మీడియా, అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాలు ఇంతే హైప్ ఇస్తాయ‌ని ఆశించాడు జ‌క్క‌న్న‌. కానీ అలాంటి ప‌రిస్థితేమీ క‌నిపించ‌డం లేదు. బాహుబ‌లి వెనుక క‌ర‌ణ్ జోహార్ ఉండ‌టం, అలాగే ఆ సినిమా త‌న‌కు తానుగా తెచ్చుకున్న హైప్ బాగా ప‌ని చేశాయి కానీ.. ఆర్ఆర్ఆర్ విష‌యంలో అలా లేదు.

ఈ సినిమా రిలీజ్ టైమింగ్ కూడా స‌రిగా కుద‌ర‌లేదు. ప‌లుమార్లు సినిమా వాయిదా ప‌డ‌టం.. పైగా క‌శ్మీర్ ఫైల్స్ సంచ‌ల‌నం రేపుతున్న స‌మ‌యంలో రిలీజ‌వుతుండ‌టం మైన‌స్ అయింది. ఇప్పుడు నార్త్ మీడియా ఫోక‌స్ మొత్తం క‌శ్మీర్ ఫైల్స్ చుట్టూనే తిరుగుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ సినిమాను భుజానికెత్తుకోవ‌డంతో మీడియా కూడా తోడైంది. పైగా ఈ వారం అక్ష‌య్ కుమార్ సినిమా బ‌చ్చ‌న్ పాండే కూడా రిలీజైంది. దీంతో ఆర్ఆర్ఆర్‌కు నేష‌న‌ల్ మీడియాలో క‌వ‌రేజీ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఈ మ‌ధ్యే పుష్ప మూవీ కూడా నార్త్‌లో డామినేట్ చేయ‌డంతో బాలీవుడ్ ఇమేజ్ మ‌స‌క‌బారింది.

ఇలాగే ఉంటే సౌత్ సినిమాల డామినేష‌న్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్న ఇన్ సెక్యూరిటీ కూడా అక్క‌డి వాళ్ల‌లో ఏర్ప‌డి ఉండొచ్చు. గంగూబాయి, క‌శ్మీర్ ఫైల్స్, బ‌చ్చ‌న్ పాండే లాంటి సినిమాల‌తో బాలీవుడ్ పుంజుకుంటున్న స‌మ‌యంలో ఆర్ఆర్ఆర్‌కు ఎక్కువ హైప్ ఇచ్చి త‌మ ఇండ‌స్ట్రీని దెబ్బ తీసుకోవ‌డమేంట‌న్న ప్ర‌శ్న తలెత్తి ఉండొచ్చు. అందుకే ఆర్ఆర్ఆర్‌కు నార్త్‌లో మీడియా క‌వ‌రేజ్ త‌క్కువే ఉంది. వాళ్లు కావాల‌నే సినిమాను త‌గ్గించి చూపే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐతే ఆర్ఆర్ార్ సైతం బాహుబ‌లి స్థాయిలో ఉండి ప్రేక్ష‌కులు చూసేందుకు ఎగ‌బ‌డితే మీడియా ఎంత  శీత‌క‌న్నేసినా నార్త్ బాక్సాఫీస్‌ను మ‌రోసారి సౌత్ సినిమా దున్నేయ‌డం ఖాయం.