గత డిసెంబరులో హిందీలో ‘83’ సినిమా విడుదలైంది. పేరున్న తారాగణం, పెద్ద డైరెక్టర్.. ఆకర్షణీయమైన కథాంశం.. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు వారం ముందే అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’ను హిందీలో కూడా రిలీజ్ చేశారు. దీనికి పెద్దగా ప్రమోషన్లు లేవు. రిలీజ్ విషయంలోనూ చాలా హడావుడి అయింది. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజైన ‘పుష్ప’.. ఏమాత్రం ప్రభావం చూపుతుందో అని అంతా సందేహించారు. పైగా తర్వాతి వారమే ‘83’ రిలీజవుతుండటంతో బన్నీ సినిమా అడ్రస్ లేకుండా పోతుందనుకున్నారు. కానీ జరిగింది వేరు.
‘పుష్ప’కు అనూహ్యమైన స్పందన వచ్చింది ప్రేక్షకుల నుంచి. అంతకంతకూ కలెక్షన్లు పెరుగుతూ పోయాయి ఈ సినిమాకు. దీని దెబ్బకు ‘83’ లాంటి భారీ చిత్రం అడ్రస్ లేకుండా పోయింది చివరికి. తొలి వీకెండ్లో ఓ మోస్తరు ప్రభావం చూపించిన ఈ సినిమా.. ఆ తర్వాత చల్లబడిపోయింది. మల్టీప్లెక్సుల వరకే కాస్త నిలబడింది. మాస్ సెంటర్లలో ‘పుష్ప’ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది.
పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘పుష్ప’ లాంటి అనువాద చిత్రం దెబ్బకు.. ‘83’ లాంటి పెద్ద హిందీ సినిమా నార్త్ మార్కెట్లో నిలవలేకపోవడం ఆశ్చర్యం. ఐతే అప్పుడు అలా జరిగితే.. ఇప్పుడు నార్త్ మార్కెట్లో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఓ చిన్న హిందీ సినిమా దెబ్బకు భారీ అంచనాలతో భారీ పాన్ ఇండియా సినిమా అయిన ‘రాధేశ్యామ్’ కుదేలవుతోంది. ఇది బేసిగ్గా తెలుగు సినిమానే అయినా.. ప్రభాస్‌కు నార్త్ మార్కెట్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. హిందీ కోసం ప్రత్యేకంగా పాటలు తీర్చిదిద్దారు.
అక్కడి పేరున్న ఆర్టిస్టులను కీలక పాత్రలకు తీసుకున్నారు. ఒక స్ట్రెయిట్ హిందీ సినిమా స్థాయిలో దీన్ని తీర్చిదిద్దారు. కానీ ఇంత చేసినా ఫలితం లేకపోయింది. అక్కడ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. వీకెండ్లోనే ‘రాధేశ్యామ్’ పెద్దగా ప్రభావం చూపలేదు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే చిన్న సినిమా ప్రభాస్ మూవీని గట్టి దెబ్బ కొట్టింది. ముందు దీన్ని చిన్న స్థాయిలోనే రిలీజ్ చేశారు. కానీ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడం, డిమాండ్ పెరిగిపోవడంతో వెలవెలబోతున్న ‘రాధేశ్యామ్’ స్క్రీన్లను తీసి దానిచ్చేస్తున్నారు. ఈ రకంగా ‘పుష్ప’తో కొట్టిన దెబ్బకు టాలీవుడ్‌పై బాలీవుడ్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతోంది.