ది కశ్మీర్ ఫైల్స్.. హిందీలో చిన్న చిత్రంగా మొదలై పెద్ద స్థాయికి వెళ్లేలా కనిపిస్తున్న సినిమా. సీనియర్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. కశ్మీర్లో హిందూ పండిట్ల మీద అక్కడి ముస్లిం ఛాందసవాదులు జరిగిన అఘాయిత్యాల చుట్టూ తిరుగుతుంది. బాలీవుడ్లో ఎక్కువగా ముస్లింల బాధలు, వారిపై వివక్ష నేపథ్యంలోనే సినిమాలు తీస్తుంటారని.. హిందువులను చెడుగా చూపించే ప్రయత్నమే జరుగుతుంటుందనే విమర్శలున్న సంగతి తెలిసిందే.
ఐతే కొద్ది మంది దర్శకులు మాత్రమే దీనికి భిన్నమైన కోణాల్లో సినిమాలు చేస్తుంటారు. వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు అదే చేశాడు. కశ్మీరీ పండిట్ల బాధల్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా మీద అనేక వివాదాలు కూడా ముసురుకున్నాయి. సెన్సార్ అడ్డంకుల్ని దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుత స్పందన తెచ్చుకుంటోంది. ఒక్కసారిగా ఈ సినిమాకు స్క్రీన్లు, షోలు, బుకింగ్స్ పెరిగిపోయాయి.
బ్లాక్ బస్టర్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించింది టాలీవుడ్ నిర్మాత కావడం విశేషం. ఏఏఏ ఆర్ట్స్ బేనర్ మీద కిరాక్ పార్టీ, సీత, గూఢచారి సినిమాలను నిర్మించి అభిషేక్ అగర్వాల్.. ‘కశ్మీర్ ఫైల్స్’తో బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. తొలి ప్రయత్నంలోనే ఒక సంచలన చిత్రాన్ని నిర్మించి అందరి దృష్టిలో పడ్డాడు. ఈ చిత్రం వివేక్ అగ్నిహోత్రితో పాటు ఇంకో ఇద్దరు నిర్మాతలు కూడా భాగస్వాములు అయినప్పటికీ.. లీడ్ ప్రొడ్యూసర్ అభిషేకే.
తన తొలి బాలీవుడ్ సినిమాకు వస్తున్న అద్భుత స్పందన చూసి ఆయన ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కూడా పిలుపు రావడం విశేషం. తన టీంతో కలిసి మోదీని కలిసి ఆయన అభినందనలు అందుకున్నాడు అభిషేక్. ఒక టాలీవుడ్ నిర్మాత.. ఇలా బాలీవుడ్లో తొలి సినిమాతోనే ఇలాంటి ముద్ర వేయడం, ప్రధాని ప్రశంసలు అందుకోవడం అరుదైన విషయమే.