ఎవరు ఔనన్నా కాదన్నా ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ప్రభాసే. అతడి సినిమాల బడ్జెట్లు, బిజినెస్ లెక్కలు, వసూళ్లు చూస్తేనే ఈ సంగతి అర్థమైపోతుంది. రాధేశ్యామ్ లాంటి ప్రేమకథా చిత్రం మీద కూడా రూ.300 కోట్లు ఖర్చు చేశారంటే ప్రభాస్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతడి తర్వాతి సినిమాలన్నీ కూడా ఇంతకంటే ఎక్కువ బడ్జెట్లలోనే తెరకెక్కుతున్నాయి.
ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ, అందరితో సన్నిహితంగా, మర్యాదగా మెలిగే ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే. అందుకే తనతో పని చేసిన వాళ్లు, చేయని వాళ్లు కూడా ఎంతో ప్రేమ చూపిస్తారు. ప్రభాస్ ఏదైనా సాయం అడిగితే ఎవరూ కాదనరు. అయినా ప్రభాస్‌కు ఏం సాయం అవసరం అనిపించొచ్చు కానీ.. ఇప్పుడు తన కొత్త చిత్రం రాధేశ్యామ్‌కు కొందరు ప్రముఖుల సహకారం కోరుకున్నాడు.
ఈ చిత్రానికి వివిధ భాషల్లో వాయిస్ ఓవర్ కోసం ఆయా ఇండస్ట్రీల పెద్దల సహకారం తీసుకున్నాడు ప్రభాస్. హిందీలో రాధేశ్యామ్ చిత్రానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. ఇది ఇప్పుడు రూఢి అయింది. ఇక దక్షిణాదిన నాలుగు వెర్షన్ల కోసం ముగ్గురి సాయం తీసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్.
తెలుగు, తమిళ వెర్షన్లకు దర్శక ధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వగా.. కన్నడలో అక్కడి సూపర్ స్టార్లలో ఒకడైన శివరాజ్ కుమార్ గాత్రదానం చేశాడు. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ బాధ్యత తీసుకున్నాడు. కథను, పాత్రలను ఆయా భాషల్లో వీళ్లే పరిచయం చేయబోతున్నారు. ప్రభాస్ సినిమా అంటే బాగా ఆడాలని అందరూ కోరుకునేవారే. సాహోతో నిరాశ పరిచిన ఈ మాచో స్టార్.. మళ్లీ రాధేశ్యామ్‌తో అందరి అభిమానం చూరగొంటాడేమో చూడాలి. ఈ శుక్రవారమే రాధేశ్యామ్ ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే.