ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే నటనలో, స్టార్ ఇమేజ్ విషయంలో అమితాబ్ బచ్చన్ స్థాయి ప్రత్యేకమైంది. ఆయన ఒకప్పుడు ఇండియాలోనే నంబర్ వన్ హీరో. నటుడిగానూ గొప్ప పేరు సంపాదించిన అమితాబ్.. ఒక సినిమా విషయంలో కమల్ హాసన్‌కు భయపడ్డారట. కమల్ ముందు తాను ఎక్కడ తేలిపోతానో అని.. ఒక సినిమాను ఆయన వదులుకున్నాడట.
ఈ విషయాన్ని ప్రఖ్యాత తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ ఒక ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించారు. ఆ సినిమా పేరు.. ఖబద్దార్ అట. భాగ్యరాజ్.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లతో ఈ సినిమా తీయాలని అనుకున్నారట. ఈ సినిమా కోసం అమితాబ్ బచ్చన్‌ను సంప్రదిస్తే ముందు ఓకే అన్నారట. ఐతే స్క్రిప్టు పూర్తి స్థాయిలో విన్నాక మాత్రం ఆయన కమల్‌కు భయపడి వెనక్కి తగ్గినట్లు భాగ్యరాజ్ వెల్లడించారు.
ఆ సినిమా పతాక సన్నివేశంలో కమల్ పాత్ర చనిపోతుందట. ఆ పాత్ర చనిపోవడంతోనే కథకు బలం చేకూరుతుందట. కానీ కమల్ పాత్ర చనిపోతే అదే సినిమాలో హైలైట్ అవుతుందని.. చనిపోయే సన్నివేశంలో కమల్ నటన ముందు తాను తేలిపోతానని అమితాబ్ భయపడ్డట్లు భాగ్యరాజ్ తెలిపారు.
ఈ విషయాన్ని ఆయన ఓపెన్‌గానే తనతో చెప్పారని.. ఈ సినిమా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందని భావించారని.. డబ్బులు పోయినా పర్వాలేదని, కానీ పేరు పోకూడదని చెప్పారని.. దీంతో ఆ సినిమా తాను చేయలేనని.. కావాలంటే మరో సినిమాకు డేట్లు ఇస్తానని చెప్పి ఆయన తప్పుకున్నారని భాగ్యరాజ్ వెల్లడించారు.
దక్షిణాది ఆ తర్వాతి ఏళ్లలో కూడా అమితాబ్ సినిమాలు చేయలేదు. చివరికి తమిళంలో గత ఏడాది ఎస్.జె.సూర్యతో కలిసి ‘ఉయంత మణిదం’ అనే సినిమాలో నటించారు. చిరంజీవి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లోనూ గత ఏడాది ఆయనో కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates