జియో పుణ్యమా అని మొబైల్ ఇంటర్నెట్ చాలా చౌకగా మారిపోయింది దేశంలో. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో సినిమాలు, కామెడీ స్కిట్లు, ఇతర వీడియోలన్నింటికీ కూడా అమాంతం వ్యూయర్ షిప్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు నుంచి హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసిన ప్రతి సినిమాకూ ఉత్తరాదిన కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి.
ఇలా నార్త్ ఇండియాలో బాగా పాపులారిటీ సంపాదించిన టాలీవుడ్ యువ కథానాయకుల్లో రామ్ ఒకడు. అతడి సినిమాలు పాతవి ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నా భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్‌లో పెట్టిన తన సినిమాలన్నింటితో కలిపి రామ్ ఏకంగా 200 కోట్ల వ్యూస్ సాధించడం విశేషం. అతను తాజాగా 2 బిలియన్ క్లబ్బులో చేరిన నేపథ్యంలో తన చిత్రాల వ్యూస్‌కు సంబంధించి పీఆర్వో టీం బ్రేకప్స్‌తో వివరాలు వెల్లడించింది.
రామ్ కెరీర్లోనే అత్యధికంగా నేను శైలజ చిత్రానికి యూట్యూబ్‌లో ఏకంగా 44 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో ఉన్నది హలో గురూ ప్రేమకోసమే. ఈ చిత్రం 40.4 కోట్ల వ్యూస్ సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్నది ఒకటే జిందగీ. ఆ సినిమాకు 31.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పటిదాక 25 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టింది. రామ్ మరో సినిమా హైపర్ యూట్యూబ్‌లో 17 కోట్ల వ్యూస్ సాధించింది. మిగిలిన రామ్ సినిమాలకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. ఇలా మొత్తం కలిపితే వ్యూస్ 2 బిలియన్ మార్కును దాటిపోయాయి.
దక్షిణాదిన తన సినిమాల వ్యూస్‌తో 2 బిలియన్ మార్కును అందుకున్న తొలి కథానాయకుడు రామే అంటూ పీఆర్వో టీం చెబుతోంది. రామ్ అనే కాదు.. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరో సినిమాలకు కూడా నార్త్‌లో ఇలాగే భారీ వ్యూస్ వస్తుండటం విశేషం.