తెలంగాణా గవర్నర్ తమిళిసైకి పెద్ద అవమానమే జరిగింది. సమ్మక్క-సారక్క జాతరలో భాగంగా చివరి రోజున గవర్నర్ వరంగల్ జిల్లాలోని మేడారంకు వెళ్ళారు. అయితే గవర్నర్ ను రిసీవ్ చేసుకునేందుకు మంత్రులెవరు లేరు. తమిళిసై వచ్చే ముందువరకు అక్కడే ఉన్న జిల్లా మంత్రులు హఠాత్తుగా మాయమైపోయారు. జాతర మొదలైన 16వ తేదీనుండి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతీ రాతోడ్ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
శనివారం జాతర చివరిరోజు. మొదటిరోజు కేసీయార్ హాజరయ్యారు. తర్వాత ప్రతిరోజు రెగ్యులర్ గా మంత్రులతో పాటు ఎంతోమంది ప్రముఖులు హాజరవుతునే ఉన్నారు. అందుకనే చివరి రోజు గవర్నర్ హాజరయ్యేట్లు ప్రభుత్వం ప్లాన్ చేసింది. అనుకున్నట్లే తమిళిసై చివరి రోజు హాజరయ్యారు కానీ ప్రోటోకాల్ వివాదం రేగింది. గవర్నర్ మేడారంకు చేరుకునే సమయానికి మంత్రులు మాయమైపోయారు.
ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ ను మంత్రులు రిసీవ్ చేసుకోవాలి. హాజరైన కార్యక్రమం పూర్తయ్యేవరకు మంత్రులు దగ్గరుండాలి. గవర్నర్ తిరిగి వెళ్ళేంతవరకు మంత్రులు గవర్నర్ వెంబడే ఉండాలి. అలాంటిది గవర్నర్ వచ్చేముందు వరకు అక్కడే ఉన్న మంత్రులు తీరా గవర్నర్ వచ్చిన తర్వాత కనబడకపోవటం విచిత్రంగానే ఉంది. క్షేత్రస్ధాయిలో జరుగుగున్న యవ్వారం చూస్తుంటే మంత్రులు కావాలనే ప్రోటోకాల్ ను ఉల్లంఘించి వెళ్ళిపోయినట్లు అర్ధమైపోతోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడికి కేసీయార్ కు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ముఖ్యమంత్రుల లెక్క ప్రకారం గవర్నర్లు కేంద్రప్రభుత్వం ఏజెంట్లు. అందుకనే గవర్నర్లలో అత్యధికులు కేంద్రం చెప్పినట్లే నడుచుకుంటారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో గవర్నర్లకు ముఖ్యమంత్రులకు మధ్య ఎంత వివాదం రేగుతోందో అందరు చూస్తున్నదే. తెలంగాణాలో గవర్నర్-సీఎం మధ్య పెద్దగా గొడవలేమీ లేవనే చెప్పాలి. అయితే ఎంతైనా మోడితో కేసీయార్ కు పడని కారణంగా కేసీయార్+మంత్రులకు మధ్య ప్రోటోకాల్ వివాదం మొదలైనట్లే ఉంది. మరి తాజా వివాదం ఎంతదూరం వెళుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates