ఆ పుకార్లపై స్పందించిన చరణ్

హీరో రామ్ చరణ్ కు చెందిన విమానయాన సంస్థ ట్రూజెట్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ట్రూజెట్ మూతపడిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని మీడియాలోనూ కథనాలు వచ్చాయి.

అంతేకాదు, టాటాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ వార్తలపై రామ్ చరణ్ స్పందించారు. ఆ వార్తలు పూర్తి అవాస్తవమని, ఉద్యోగులందరికీ వేతనాలను చెల్లిస్తున్నట్టు చెప్పారు. ట్రూజెట్ విమాన సేవలు ఆపేస్తున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని, తమ సంస్థపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఇక, సంస్థలో కొందరు అధికారులు రాజీనామా చేశారని, కొత్త వారిని వారి స్థానంలో భర్తీ చేశామని ట్రూజెట్ ఎండీ ఉమేష్ చెప్పారు. త్వరలోనే ఓ ఇన్వెస్టర్ రానున్నారని, ఆ తర్వాత కొత్త సీఈవోను ప్రకటించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

త్వరలోనే మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఒక ఇన్వెస్టర్ నుంచి 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు) సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే ఇవి ఫైనల్ అవుతాయని అన్నారు. ఉడాన్ పథకం కింద అత్యంత చౌక ధరలకే విమాన సర్వీసులను ట్రూజెట్ నడుపుతోన్న సంగతి తెలిసిందే.