భీమ్లా నాయక్ ఇంకో పది రోజుల్లోనే విడుదల కాబోతోందంటే పవర్ స్టార్ అభిమానులకు.. ఇంకా ఆ వార్త జీర్ణం కావట్లేదు. రిలీజ్ డేట్ పోస్టర్ వదిలాక కూడా వారిలో అనుమానాలు కొనసాగుతున్నాయి. వాయిదా పక్కా అనుకున్నాక ఈ నెల 25నే రిలీజ్ అంటూ స్వీట్ షాక్ ఇచ్చింది చిత్ర బృందం.
నిజంగా ఆ డేట్‌కు సినిమా వస్తుందా.. లేక మళ్లీ వాయిదా నిర్ణయం ప్రకటిస్తారా అని పవన్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కానీ భీమ్లా నాయక్ పక్కాగా ఈ నెల 25న రిలీజయ్యేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే 24న ఓవర్సీస్లో ప్రిమియర్స్‌కు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ సైతం మొదలైపోవడం విశేషం. చకచకా టికెట్లు కూడా అమ్ముడైపోతుండటంతో ఇక అనుమానాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదనే అనిపిస్తోంది.
యుఎస్ ప్రిమియర్ షోలకు సంబంధించి టికెట్ల బుకింగ్స్ మొదలుపెట్టిన వెబ్ సైట్లు.. భీమ్లా నాయక్ రన్ టైం గురించి కూడా సమాచారాన్ని పంచుకోవడం విశేషం. టికెటింగ్ యాప్స్‌లో పేర్కొన్న ప్రకారం భీమ్లా నాయక్ రన్ టైం 2 గంటల 21 నిమిషాలు. అంటే మలయాళ వెర్షన్‌తో పోలిస్తే అరగంటకు పైగానే నిడివి తక్కువ ఉండబోతోందన్నమాట. అయ్యప్పనుం కోషీయుంకు ఎంత అప్లాజ్ వచ్చినప్పటికీ రన్ టైం విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
మరీ మూడు గంటల పాటు సినిమా చూడటం కొంత విసుగు తెప్పించేదే. అందులో కొన్ని సీన్లు రిపిటీటివ్గా అనిపిస్తాయి కూడా. వాటన్నింటినీ కుదించి క్రిస్ప్ రన్ టైంతో భీమ్లా నాయక్‌ను దించబోతున్నారన్నమాట. రేపో ఎల్లుండో భీమ్లా నాయక్‌కు సెన్సార్ జరిపిస్తారని.. ఆ వెంటనే ట్రైలర్ లాంచ్ చేస్తారని.. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా మూణ్నాలుగు రోజుల్లోనే ఉంటుందని.. అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసి సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.