మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ఖిలాడి రిలీజ్ విషయంలో కొన్ని రోజుల ముందు వరకు చాలా సందిగ్ధత నడిచింది. దర్శక నిర్మాతలు రమేష్ వర్మ, కోనేరు సత్యనారాయణ ఫిబ్రవరి 11నే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పట్టుబడితే.. హీరో రవితేజ మాత్రం వారం తర్వాత ఖిలాడిని థియేటర్లలోకి దించితే మంచిదని అభిప్రాయపడ్డాడని.. కానీ అతడి మాటను కాదని రమేష్, సత్యనారాయణ 11నే సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించడంతో మాస్ రాజా హర్టయ్యాడని వార్తలొచ్చాయి.
ఏపీలో ఇంకా నైట్ కర్ఫ్యూ, 50 పర్సంట్ ఆక్యుపెన్సీ అమలవుతున్న నేపథ్యంలో రవితేజ వాయిదా కోరుకున్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ప్రమోషన్లలో ఎక్కడా రవితేజ కనిపించకపోవడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ఐతే అనుమానాలకు మాస్ రాజా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఖిలాడి ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కొంచెం ఆలస్యంగా అయినా హాజరయ్యాడు.
తన ప్రసంగం సమయంలో దర్శక నిర్మాతల గురించి చాలా పాజిటివ్‌గానే మాట్లాడాడు రవితేజ. ఐతే ఈ సినిమాను 11న రిలీజ్ చేసే విషయంలో అనుమానాలు వ్యక్తమైనట్లుగా రవితేజ మాట్లాడ్డం గమనార్హం. 18న రిలీజ్ చేద్దామని అనుకున్న మాట వాస్తవమే అని చెప్పాడు. 11నే సినిమాను రిలీజ్ చేసే విషయంలో కొంచెం హడావుడి నెలకొందని కూడా రవితేజ వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఏదో ఒక డిస్టబెన్స్ అయితే ఉన్న మాట వాస్తవమే అని రవితేజ మాటల్ని బట్టి అర్థమైంది.
ఈ సంగతలా ఉంచితే దర్శకుడు రమేష్ వర్మను మహర్జాతకుడిగా అభివర్ణించాడు మాస్ రాజా. మామూలుగా తాను జాతకాలను, అదృష్టాన్ని అసలు నమ్మనని.. అది 2-3 శాతం మాత్రమే ఉండొచ్చని.. ఐతే రమేష్ వర్మకు మాత్రం జాతకం, అదృష్టం నిర్మాత కోనేరు సత్యనారాయణ రూపంలో బాగా కలిసొస్తున్నాయని.. ఖిలాడి లాంటి సినిమాకు అన్నీ గొప్పగా సమకూరడం, విడుదలకు ముందే కారు బహుమతిగా అందుకోవడం అంటే రమేష్ మహర్జాతకుడు కాక మరేంటి అని రవితేజ అన్నాడు.