ఆ సినిమా ముంచేసిందన్న రచయిత

జె.కె.భారవి.. ‘అన్నమయ్య’ లాంటి ఆల్ టైం క్లాసిక్‌కు కథ, మాటలు అందించి గొప్ప పేరు సంపాదించిన రచయిత. ఆ తర్వాత ఆయన రచనలో వచ్చిన ‘శ్రీరామదాసు’ సైతం ఘనవిజయాన్నందుకుంది. ఆయనకు తెలుగు సినిమా చరిత్రలో ఈ రెండు చిత్రాలు ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చిపెట్టాయి. ఇవి కాక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ మంజునాథ, పాండు రంగడు, షిరిడి సాయి, శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం లాంటి ఆధ్యాత్మిక చిత్రాలకు సైతం భారవి రచన చేశారు.

ఇవి కాక ‘శక్తి’ సహా కొన్ని కమర్షియల్ సినిమాలకు కూడా ఆయన స్క్రిప్టు విభాగంలో పని చేశారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసిన భారవి.. చివరగా స్వీయ దర్శకత్వంలో ‘జగద్గురు ఆది శంకరాచార్య’ అనే సినిమా తీశారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడా. ప్రముఖ తారాగణాన్ని పెట్టుకుని పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీశారు భారవి. ఐతే ఈ సినిమా ఆయకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

తాజాగా ఒక మీడియా సంస్థకు భారవి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఆదిశంకరాచార్య’ తర్వాత కనుమరుగైపోవడానికి కారణాలేంటో ఆయన వివరించారు. అంతకుముందు చేసిన సినిమాలతో తాను బాగానే సంపాదించానని.. కానీ ఈ ఒక్క సినిమా తనను దాదాపుగా రోడ్డు మీదికి తీసుకొచ్చేసిందని అన్నారు భారవి. ఈ సినిమా మీద పెట్టిన డబ్బులన్నీ పోయాయని.. ఎన్నో కార్లు చూసిన తాను ఇప్పుడు ఇంటర్వ్యూలో బైక్ వేసుకుని రావాల్సి వచ్చిందని భారవి వివరించారు.

తన రచనలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి గొప్ప సినిమాల్లో నటించిన నాగార్జునకు తన పరిస్థితి తెలిస్తే కచ్చితంగా ఆర్థిక సాయం చేస్తారని.. కానీ ఎవరినీ సాయం అడగడం తనకు ఇష్టముండదని., అందుకే సైలెంటుగా ఉన్నానని చెప్పారు భారవి. ప్రస్తుతం తాను కొన్ని సినిమాలకు పని చేస్తున్నానని.. ఐతే గత సినిమాల ప్రభావం, కరోనా కారణంగాసరిగా పారితోషకాలు అందట్లేదని.. అందుకే ఇబ్బంది పడుతున్నానని చెప్పారాయన.