మాస్ మహరాజా రవితేజ కొత్త సినిమా ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. కరోనా మూడో వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని 11నే రిలీజ్ చేయాలని పట్టుదలతో కనిపించింది చిత్ర బృందం. ఈ దిశగా ప్రమోషన్లు కూడా జోరుగానే నడుస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచన మారిపోయినట్లు సమాచారం.
ఇందుక్కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే. నిజానికి ఈ వారంతో ఏపీలో నైట్ కర్ఫ్యూ ముగుస్తుందని అనుకున్నారు. ఆ అంచనాతోనే 11న ‘ఖిలాడి’ని రిలీజ్ చేయొచ్చని భావించారు. కానీ జగన్ సర్కారు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 14 వరకు ఇది అమలవుతుందని ప్రకటించింది. దీంతో సెకండ్ షోలకు ఇబ్బంది అవుతుంది. ఆదాయానికి గండి పడుతుంది.
50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల పడే కోతకు తోడు సెకండ్ షోలు కూడా రద్దయ్యాయంటే కష్టమవుతుంది.అందుకే ‘ఖిలాడి’ టీం రిలీజ్‌ను ఒక వారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ నైట్ కర్ఫ్యూ పొడిగించకుంటే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందని, కర్ఫ్యూ కచ్చితంగా ఎత్తేస్తారని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా థియేటర్లపై ఇప్పటికే ఆంక్షలు ఎత్తి వేస్తున్నారు.
కానీ ఏపీలో మాత్రం చిత్రంగా రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఏ ప్రయోజనం లేకుండా నైట్ కర్ఫ్యూ అమలు చేయడం ద్వారా సెకండ్ షోలను రద్దు చేయిస్తున్నారు. సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ‘ఖిలాడి’ వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఫిబ్రవరి 11న ‘సెహరి’తో పాటు ‘డీజే టిల్లు’ రాబోతున్నాయి. ‘డీజే టిల్లు’ను ఈ వారమే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. వారం వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.