స్టార్ హీరోలందరూ తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ని అటూ ఇటూ తెగ మార్చేస్తున్నారు. దాంతో జనాలకే కాదు.. ఇండస్ట్రీలోనూ కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. ఎవరు ఏ డేట్‌కి ఫిక్సవ్వాలి, అప్పటికి ప్రశాంతంగా ఉంటుందా లేక మరేదైనా సినిమా పోటీకి వస్తుందా అంటూ అందరికీ టెన్షన్‌గానే ఉంటోంది. అందుకేనేమో.. ప్రతి ఒక్కరూ రెండేసి రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు.
అందరికంటే ముందు రాజమౌళి రెండు డేట్స్ ప్రకటించాడు. అయితే ఇది, లేదంటే అది అన్నాడు. కానీ ఆ రెండూ వదిలేసి మధ్యలో మరో రోజుకి ఫిక్సయ్యాడు. భీమ్లానాయక్ కూడా దాన్నే ఫాలో అయ్యాడు. ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న వస్తానని తేల్చాడు. తర్వాత వరుణ్ తేజ్ ‘గని’ విషయంలోనూ అదే జరిగింది. మార్చ్ 18న రావాల్సిన ఈ సినిమాని ఫిబ్రవరి 25న కానీ మార్చ్ 4న కానీ విడుదల చేస్తామంటూ ప్రకటించారు.
ఇప్పుడు రవితేజ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. అతడు హీరోగా శరత్ మండవ డైరెక్షన్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చ్ 25న విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే డేట్‌కి ఆర్‌ఆర్‌ఆర్ ఫిక్సయ్యింది. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ నిర్ణయం మారింది. మార్చ్ 25న కానీ ఏప్రిల్ 15న కానీ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ని రిలీజ్ చేస్తామంటూ రెండు తేదీలు ప్రకటించింది టీమ్.
ఒకవేళ రాజమౌళి నిర్ణయంలో కనుక మార్పు వస్తే రామారావ్ హ్యాపీగా ముందు చెప్పిన డేట్‌కే వచ్చేస్తాడు. లేదంటే రెండో తేదీకి వస్తాడు. ఏదైనా అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. అందుకే అలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడన్నమాట. వీళ్ల ముందు చూపు సంగతేమో కానీ.. ఇలా మార్చుకుంటూ పోవడం, ఒక్కోదానికీ రెండేసి డేట్లు ఇవ్వడం చూసి ఏ సినిమా ఎప్పుడొస్తుందో తెలియక ప్రేక్షకులైతే జుట్టు పీక్కోవడం ఖాయం.