కరోనా దెబ్బకు అన్ని రంగాల్లోనే సినీ పరిశ్రమ కూడా కుదేలవుతోంది. పూర్తయిన సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు. షూటింగ్ మొదలైన సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. ఇక మొదలుపెడదాం అనుకున్న చిత్రాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సమీప భవిష్యత్తులో థియేటర్లు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. వాటి నుంచి మునుపట్లా రెవెన్యూ రావాలంటే ఎంత కాలం పడుతుందో తెలియట్లేదు.
సినిమాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అయినా ఎవరూ అంత తొందరగా తమ సినిమాల్ని రిలీజ్ చేసే సాహసమూ చేయలేరు. ఈ పరిస్థితుల్లో నిర్మాతల పరిస్థితి దయనీయంగా మారబోతోంది. పేరున్న నిర్మాతలు సైతం భారం మోయలేక నష్టాల పాలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్లలో కచ్చితంగా కోత విధించక తప్పని పరిస్థితి తలెత్తనుంది. ఇందుకనుగుణంగా అందరూ పారితోషకాలు కూడా తగ్గించుకోవాల్సిందే.
ఈ విషయమై ఇప్పటికే సమావేశం నిర్వహించిన టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్.. కాస్ట్ అండ్ క్రూలో అందరూ 25 శాతం పారితోషకాలు తగ్గించుకోవాలన్న తీర్మానం చేసింది. కానీ తీర్మానం అయితే చేశారు కానీ.. దాన్ని అమలు చేయడం సాధ్యమా అన్నది ప్రశ్న. స్వచ్ఛందంగా ముందుకొచ్చి పారితోషకం తగ్గించుకునేవాళ్లు కొందరుంటారు.
అలాగే అవకాశం ఇవ్వడమే పదివేలు అని భావించే నటీనటులు, టెక్నీషియన్ల దగ్గరా కోత వేయొచ్చు. కానీ డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తగ్గుతారా అన్నది ప్రశ్న. అసలు ఇక్కడ నిర్దిష్ట పారితోషకం అని ఉంటే.. అందులో 25 శాతం కోత వేయొచ్చు. కానీ సినిమాకు ఓ రకంగా పారితోషకాలు చెబుతుంటారు.
ముఖ్యంగా మొత్తం సినిమా పారితోషకాల్లో మెజారిటీ వెళ్లేది హీరోల జేబుల్లోకే. ముఖ్యంగా స్టార్ హీరోల సంగతి చెప్పాల్సిన పని లేదు. 50 కోట్ల దాకా ఖాతాలో వేసుకుంటున్న హీరోలున్నారు మన దగ్గర. వాళ్లు తమ పారితోషకం ఇంత అనేమీ చెప్పరు.
నిర్మాతలే వాళ్ల కాల్ షీట్ల కోసం ఎగబడి.. ముందు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వీళ్లే దాని కంటే కొంత శాతం పెంచి పారితోషకాలు ఫిక్స్ చేస్తారు. ఆ ఫిగర్ చెప్పి కమిట్మెంట్ తీసుకుంటారు. అసలు స్టార్ హీరో డేట్లు ఇవ్వాలే కానీ.. పారితోషకం ఎంతైనా ఓకే అన్నది నిర్మాతల పాలసీగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ పారితోషకం ఇంత.. అందులో 25 శాతం కోత వేసి ఇవ్వబోతున్నాం అని స్టార్ హీరోలకు చెప్పే ధైర్యం మన నిర్మాతలకు ఉందా అన్నది సందేహం.