మంచు విష్ణు కొత్త యాపారం

మోహ‌న్ బాబు త‌ర్వాత ఆయ‌న కుటుంబం నుంచి వ‌చ్చిన వాళ్ల‌లో ఎవ్వ‌రూ సినిమాల్లో స‌రిగా నిల‌దొక్కుకోలేక‌పోయారు. మంచు విష్ణు, మంచు మ‌నోజ్ కెరీర్ ఆరంభంలో ఎంత ఇబ్బంది ప‌డ్డారో తెలిసిందే. మ‌ధ్య‌లో అడ‌పా ద‌డ‌పా కొన్ని హిట్లు వ‌చ్చినా.. ఆ ఊపును త‌ర్వాత కొన‌సాగించ‌లేక‌పోయారు. ఐదారేళ్ల నుంచి ఇద్ద‌రి నుంచి ఓ మోస్త‌రు స్థాయి సినిమా కూడా రాలేదు. ఇక మంచు ల‌క్ష్మి గురించైతే చెప్పాల్సిన ప‌ని లేదు. ఒక‌ప్పుడు ఘ‌న‌విజ‌యాలందుకున్న ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌కు తోడు.. కొత్త‌గా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ‌ను పెట్టి గ‌త రెండు ద‌శాబ్దాల్లో చాలా సినిమాలే నిర్మించింది మంచు ఫ్యామిలీ.

కానీ వాటిలో రెండు మూడు సినిమాలు త‌ప్ప ఏవీ ఆడ‌లేదు. మొత్తంగా చూస్తే సినిమాల ప‌రంగా మంచు వారికి న‌ష్ట‌మే త‌ప్ప లాభాల్లేవు. వారి సినిమా వ్యాపారం పూర్తిగా దెబ్బ తినేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నం ఆప‌ట్లేదు మంచు విష్ణు. కొత్త‌గా 24 ఫ్రేమ్స్ బేన‌ర్ మీద అత‌ను శ్రీను వైట్ల‌తో ఢీ సీక్వెల్ చేయ‌బోతున్న‌ సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు విష్ణు కొత్త‌గా మ‌రో సినిమా వ్యాపారంలోకి దిగుతుండ‌టం విశేషం. అవా (ava) ఎంట‌ర్టైన్మెంట్ పేరుతో డిజిట‌ల్ ఎంట‌ర్టైన్మెంట్ కంపెనీని విష్ణు మొద‌లు పెట్ట‌బోతున్నాడ‌ట‌. ఈ సంస్థ‌లో ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు, లో బ‌డ్జెట్ సినిమాలు తీయ‌బోతున్నార‌ట‌. కేవ‌లం ఓటీటీ కంటెంట్ కోస‌మే నెల‌కొల్పుతున్న సంస్థ ఇది.

కొత్త న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశానికి తోడు.. భ‌విష్య‌త్ అంతా ఓటీటీల‌దే అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్‌లోకి దిగుతున్న‌ట్లు తెలిసింది. దీనికి సంబంధించి గ్రౌండ్ వ‌ర్క్ అంతా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే సంస్థ‌ను లాంఛ‌నంగా మొద‌లుపెట్టి వ‌రుస‌గా ఒరిజిన‌ల్స్ తీయ‌బోతున్నార‌ట‌. ఈ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అయితే.. ఎలాగూ సొంత సినిమాలు బోలెడ‌న్ని ఉన్నాయి కాబ‌ట్టి మంచు ఫ్యామిలీనే భ‌విష్య‌త్తులో ఒక ఓటీటీ మొద‌లుపెట్టినా ఆశ్చ‌ర్యం లేదేమో.