నేను బంగార్రాజును కాను-నాగ్

టాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ హీరో ఎవరు అంటే చాలామంది నుంచి వినిపించే సమాధానం అక్కినేని నాగార్జున. తెర మీద ఆయన రొమాన్స్ పండించే తీరే వేరుగా ఉంటుంది. ఇటీవల కూడా ‘బంగార్రాజు’ సినిమాలో నాగ్ ఎంత రొమాంటిగ్గా నటించాడో తెలిసిందే. స్వర్గంలో అప్సరసలతో సరసాలాడే పాత్రలో నాగ్ తన మార్కు చూపించారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో అయినా.. ‘బంగార్రాజు’లో అయినా ఆయన పాత్ర అంతలా పండటానికి బేసిగ్గా నాగ్‌కు ఉన్న రొమాంటిక్ ఇమేజ్ కూడా ఒక కారణం.

ఐతే తెరమీద ఎక్కువగా ఇలాంటి పాత్రల్లో చూసిన నేపథ్యంలో నాగ్ నిజ జీవితంలో కూడా చాలా రొమాంటిక్ అనే అభిప్రాయం జనాల్లో ఉన్న మాట వాస్తవం. ఐతే నిజ జీవితంలో తాను బంగార్రాజును కానే కానంటున్నాడు  అక్కినేని హీరో. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్య చేశాడు.‘‘జనాలకు మేం కేవలం నటులుగానే తెలుసు.

తెర మీద మమ్మల్ని చూసి అదే పర్సనాలిటీని ఊహించుకుంటారు. నా సినిమాల్లో నేను విలన్లను కొట్టాను కాబట్టి నిజ జీవితంలో కూడా అలాగే అందరినీ కొట్టేయను కదా. అలాగే నేను సినిమాల్లో ఎక్కువగా అమ్మాయిలతో రొమాన్స్ చేస్తే దాన్ని బట్టి నా నిజ జీవిత వ్యక్తిత్వాన్ని నిర్దేశించుకోకూడదు. నేను నిజ జీవితంలో బంగార్రాజును కాదు. దురదృష్టవశాత్తూ మనకు సక్సెస్ తెచ్చిపెట్టే ఇమేజ్‌నే నిజ జీవితానికి కూడా వర్తింపజేసుకుంటారు’’ అని నాగ్ అన్నాడు.

ఇక తన కెరీర్ గురించి నాగ్ చెబుతూ.. తాను అన్ని రకాల జానర్లలోనూ నటించాలనుకుంటున్నానని.. కానీ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాలు మాత్రం చేయలేనని చెప్పాడు. ‘‘ఇప్పుడు నేను స్పోర్ట్స్ డ్రామాలు చేయడం అంటే కష్టమే. వయసు అందుకు అడ్డంకి అవుతుంది. నేను యుక్త వయసులో ఉన్నపుడు ఈ జానర్లో పెద్దగా సినిమాలే వచ్చేవి కావు. అప్పటి ఫిలిం మేకర్స్ ఆ జానర్ పెద్దగా ప్రయత్నించలేదు. 2001లో లగాన్ వచ్చాక ఈ ట్రెండ్ ఊపందుకుంది. నెమ్మదిగా దక్షిణాదికి కూడా ఈ జానర్ పాకింది. నేను మాత్రం ఇప్పుడా జానర్లో సినిమా చేయలేను’’ అని నాగ్ అన్నాడు.