త్రివిక్రమ్ అసలు ప్లాన్ ఇదే..!

‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత ఇప్పటివరకు త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు. ఇప్పటికే రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఈ ఏడాది కూడా ఆయన నుంచి సినిమా రాదనే మాటలు వినిపించాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు గతేడాదిలోనే ప్రకటన వచ్చింది.

కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే రీసెంట్ గా సినిమా పాటల పని మొదలైనట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా పూజాహెగ్డేను కూడా ఖాయం చేసుకున్నారు. ఇక షూటింగ్ కి వెళ్లడమే బ్యాలెన్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఏడెనిమిది నెలల సమయం పడుతుంది.

ఎంత వేగంగా షూటింగ్ చేసినా.. పెద్ద హీరో సినిమా అంటే ఏడు నెలల సమయం ఈజీగా పడుతుంది. కాబట్టి సంక్రాంతి 2023కి ఈ సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు త్రివిక్రమ్. ఈ టార్గెట్ తోనే సినిమా పనులు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ ను చాలా కాలం క్రితమే పూర్తి చేశారు త్రివిక్రమ్. మహేష్ వస్తే షూటింగ్ కి వెళ్లడానికి రెడీగా ఉన్నారు.

కానీ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో బిజీగా ఉండి డేట్స్ ఇవ్వలేకపోయారు. ఆ తరువాత మహేష్ కరోనా బారిన పడడం, తన సోదరుడిని కోల్పోవడంతో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మరింత ఆలస్యమైంది. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ తన సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. మహేష్ కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది.