బిగ్ బాస్ ఓటీటీలో ‘RRR’ సింగర్!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటివరకు తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. రీసెంట్ గా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టారు. అక్కడ ఈ షో ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేదు. కానీ తెలుగులో కూడా ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. 

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ ఓటీటీ బిగ్ బాస్ షో మొదలవుతుంది. అక్కినేని నాగార్జున దీన్ని హోస్ట్ చేయబోతున్నారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో ఒక సింగర్, ఒక డాన్స్ మాస్టర్, ఒక కమెడియన్ ఇలా అన్ని కేటగిరీలకు చెందిన ఒక్కో కంటెస్టెంట్ ఉండేలా చూసుకుంటారు. ఇప్పటివరకు కల్పన, గీతామాధురి, రాహుల్ సిప్లిగంజ్, శ్రీరామచంద్ర ఇలా చాలా మంది సింగర్స్ ఈ షోలో కనిపించారు. 

బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా ఓ సింగర్ కనిపించబోతున్నాడని సమాచారం. అతడు మరెవరో కాదు.. హేమచంద్ర. ఇప్పటికే అతడి రెండు, మూడు సార్లు బిగ్ బాస్ షోకి వెళ్లే అవకాశం వచ్చినా.. వదులుకున్నారట. కానీ ఈసారి మాత్రం హేమచంద్ర బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయని సమాచారం. 

హేమచంద్రకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్ పాడి తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలానే కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కి డబ్బింగ్ చెప్పి మెప్పించారు హేమచంద్ర. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో దోస్తీ సాంగ్ పాడి తన రేంజ్ మరింత పెంచుకున్నారు. మరి బిగ్ బాస్ షో అతడికి ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి!