ఇది నాగ్ సినిమా కాదు.. చైతూది

సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమాలో అక్కినేని నాగార్జున‌ది వ‌న్ మ్యాన్ షో. బంగార్రాజుగా రొమాంటిక్ క్యారెక్ట‌ర్లో, భ‌య‌స్థుడిగా రాము పాత్ర‌లో ఆయ‌న అద‌ర‌గొట్టేశాడు. జ‌నాల‌కు ఆ రెండు పాత్ర‌లు, అలాగే సినిమా తెగ న‌చ్చేసి సూప‌ర్ హిట్ చేశారు. ఈ ఉత్సాహంతో దీనికి సీక్వెల్‌గా బంగార్రాజు చేశాడు నాగార్జున‌. బంగార్రాజు అని పేరు పెట్ట‌డంతో సోగ్గాడే..కి హైలైట్‌గా నిలిచిన బంగార్రాజు పాత్ర‌లో నాగ్ విశ్వ‌రూపం చూస్తామ‌ని, క‌థంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంద‌ని అనుకున్నారంతా.

నాగ్ పెద్ద కొడుకు నాగ‌చైత‌న్య కూడా ఇందులో న‌టిస్తున్నాడంటే అత‌డిది క్యామియో రోల్ అయ్యుంటుంద‌ని అనుకున్నారు. కానీ ఒక్కో ప్రోమో చూస్తున్న‌కొద్దీ ఆ అభిప్రాయం మారిపోయింది. నాగ్ పాత్ర‌తో స‌మానంగా చైతూ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని అనిపించింది. కానీ ట్రైల‌ర్ చూశాక ఈ అభిప్రాయం కూడా మారిపోయింది.

అస‌లీ సినిమాలో హీరో నాగార్జున కాదు.. చైతూ అనే విష‌యం ట్రైల‌ర్ చూశాకే అర్థ‌మైంది. బంగార్రాజు మ‌న‌వ‌డిగా చిన్న బంగార్రాజుగా క‌నిపించ‌బోతున్నాడు చైతూ. క‌థ మొద‌ల‌య్యేది.. ముందుకు సాగేది అత‌డి పాత్ర‌తోనే. నాగార్జున పాత్ర ఎక్స్‌టెండెడ్ క్యామియో లాగా క‌నిపించ‌బోతోంది. సోగ్గాడే చిన్నినాయ‌నాలో మాదిరే స్వ‌ర్గంలో సంద‌డి చేసి ఆ త‌ర్వాత కిందికి వ‌చ్చే పాత్ర‌లా క‌నిపిస్తోంది బంగార్రాజుది.

సోగ్గాడే చిన్నినాయ‌నాలో కొడుకు కాపురాన్ని చ‌క్క‌దిద్ది, అత‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే పాత్ర‌లో క‌నిపిస్తే.. ఇందులో మ‌న‌వ‌డికి సాయం చేసే పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది బంగార్రాజు క్యారెక్ట‌ర్. సోగ్గాడే..లో కొడుకు పాత్ర‌ను కూడా నాగార్జునే చేయ‌డంతో ఆయ‌న హ‌వానే న‌డిచింది. కానీ ఇక్క‌డ మ‌న‌వ‌డిగా చైతూ వ‌చ్చాడు. నిడివి ప‌రంగా, అలాగే పాత్ర తాలూకు డామినేష‌న్ చూస్తుంటే చైతూనే ఇందులో హైలైట్ అయ్యేలా ఉన్నాడు.