హద్దులు దాటిన దిల్ రాజు సినిమా..

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ దిల్ రాజు నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. రౌడీ బాయ్స్. ఆయ‌న సోద‌రుడు శిరీష్ కొడుకైన అశిష్ రెడ్డి ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ చేయించిన‌పుడు సెన్సార్ బోర్డు స‌భ్యులు ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌.

ఇది నిజంగా మీ సినిమానేనా అని దిల్ రాజును అడిగార‌ట‌. అందుక్కార‌ణం.. ఇందులో కొంచెం బోల్డ్, రొమాంటిక్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌ట‌మే. మామూలుగా త‌మ సంస్థ నుంచి వ‌చ్చే సినిమాలు చాలా ప‌ద్ధ‌తిగా, ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటాయ‌ని.. కానీ రౌడీ బాయ్స్ విష‌యంలో తాము కొంచెం హ‌ద్దులు దాటామ‌ని న‌వ్వుతూ చెప్పారు దిల్ రాజు.

త‌న సోద‌రుడి కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న‌పుడు సినిమా యూత్ ఫుల్‌గా ఉండాల‌ని అనుకున్నామ‌ని.. అందుకే హుషారు ద‌ర్శ‌కుడు హ‌ర్షకు చెప్పి మంచి యూత్ ఫుల్ స్టోరీ రెడీ చేయించామ‌ని.. ప్రేమ దేశం, తొలి ప్రేమ‌, హ్యాపీ డేస్, అలాగే త‌మ సంస్థ నుంచి వ‌చ్చిన ఆర్య సినిమాల త‌ర‌హాలో రౌడీ బాయ్స్ చాలా యూత్ ఫుల్‌గా ఉంటుంద‌ని.. 15-25 వ‌య‌సులో ఉన్న యువ‌త అంద‌రూ ఫుల్‌గా ఎంజాయ్ చేసేలా సినిమా తీశామ‌ని చెప్పాడు దిల్ రాజు.

త‌మ సంస్థ‌లో ఆర్య సినిమా తెర‌కెక్కుతున్న స‌మ‌యానికి అశిష్ వ‌య‌సు ఏడేళ్ల‌ని.. అందులో త‌క‌థిమితోం పాట చిత్రీక‌రిస్తున్న‌పుడు సెట్లోకి వ‌చ్చి త‌న పాటికి తాను సంగీతానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తుండేవాడ‌ని.. అప్పుడు అల్లు అర్జున్ కూడా అత‌ణ్ని చూస్తూ ఉండిపోయాడ‌ని దిల్ రాజు గుర్తు చేసుకున్నాడు. సంక్రాంతికి త‌మ బేన‌ర్ నుంచి ఐదు సినిమాలు రిలీజైతే.. ఆ ఐదూ సూప‌ర్ హిట్లే అని.. ఈ ఒరవ‌డిని కొన‌సాగిస్తూ రౌడీ బాయ్స్ డ‌బుల్ హ్యాట్రిక్ అవుతుంద‌ని రాజు ధీమా వ్య‌క్తం చేశారు.