రవితేజ సినిమాలో మరో యంగ్ హీరో!

మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా తరువాత జోరు పెంచారు. ఓ పక్క తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూనే.. మరో పక్క కొత్త సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఇటీవల ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసిన రవితేజ ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలు సెట్స్ పై ఉండగానే.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సినిమాలో నటించబోతున్నట్లు చెప్పారు. సంక్రాంతి నాడు ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు రవితేజ. ఇందులో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రవితేజతో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నారు.

అతడు మరెవరో కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్. కథ ప్రకారం సినిమాలో కీలకపాత్ర కోసం విష్ణు విశాల్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ కుర్ర హీరో రానాతో కలిసి ‘అరణ్య’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు మరో తెలుగు ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ కొట్టేశారు. మరి తెరపై రవితేజ-విష్ణు విశాల్ ల సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. వారు ఫరియా అబ్దుల్లా, ప్రియాంక మోహన్, దక్ష నగర్కార్ అని తెలుస్తోంది. దక్ష నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.