తెలుగు సినీ ప్రపంచం.. టాలీవుడ్.. ఫక్తు పాలిటిక్స్‌ను మించిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. మిన్ను విరిగి వెన్నుపై పడుతున్నా.. అగ్ర హీరోల మధ్య ఐక్యత భూతద్దం పట్టుకుని వెతికినా కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై.. చిన్నస్థాయి హీరోలే కలవరపడుతుంటే.. అగ్రహీరోలు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు టాలీవుడ్‌కు ఏమైందనే వాదన వినిపిస్తోంది. నాకెందుకొచ్చిందన్నట్టుగా ఉంటూ.. గతంలో ఎప్పుడూ.. టాలీవుడ్‌ను పట్టించుకోని వివాదాస్పద దర్శకుడు.. రామ్‌గోపాల్ వర్మ సైతం.. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
సినిమా టికెట్ల ధరలను ఎలా తగ్గిస్తారని.. ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ క్రమంలో ఆయన దూకుడుగానే వ్యాఖ్యలు సంధించారు. మంత్రి పేర్ని నాని వర్సెస్ రామ్‌గోపాల్ వర్మ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక, చిన్నసినిమాల దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి కూడా జోక్యం చేసుకుని నేరుగా మంత్రి నాని ఇంటికి వెళ్లి బ్రతిమాలినంత పనిచేశారు. ఇక, హీరో నాని, సిద్ధార్థలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మరి ఇంత జరుగుతున్నా.. టాలీవుడ్ పెద్దలు ఎవరూ నోరు మెదప లేదు. మాట్లాడతాం.. చర్చిస్తాం.. అంటూ.. కాలం గడుపుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇంతలోనే సినిమా టిక్కెట్ల రేట్లపై నాగార్జున చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. టిక్కెట్ రేట్లు తగ్గించినా తన సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటూ నాగ్ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలోని కొందరు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జున వ్యాఖ్యలపై స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అదేసమయంలో ప్రభుత్వంపై పోరు చేస్తున్న వారు కూడా నాగార్జున వ్యాఖ్యలతో డిఫెన్స్‌లో పడిపోయారు.
నాగార్జున ఏకపక్షంగా మాట్లాడారని టాలీవుడ్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే కొన్నాళ్లుగా.. టాలీవుడ్-ఏపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. థియేటర్ యాజమాన్యా లు.. ప్రొడ్యూసర్లు, సినీ ప్రముఖులు ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరోపణలు చేయగా.. పొలిటికల్ లీడర్స్ రివర్స్ కామెంట్స్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ జోక్యంతో ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్న సమయంలో నాగ్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీ ఇరకాటంలో పడిపోయింది. ఇదిలావుంటే, చిరంజీవి సహా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, బన్నీ వంటివారు కూడా ఈ విషయాన్ని వదిలేయడంతో టాలీవుడ్లో ఐక్యత లేదని.. ఇక, ఏపీ ప్రభుత్వం మరింత రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.