సంక్రాంతి బరిలోకి దిగాలా వద్దా అని ఊగిసలాడుతున్న బంగార్రాజుకి.. భీమ్లానాయక్ తప్పుకోవడం కలిసొచ్చినట్టే ఉంది. జనవరి 15న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి టీమ్ రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ్టితో మూవీ షూటింగ్ కూడా ముగుస్తోందని టీమ్ ప్రకటించింది. ఇక రిలీజ్ డేట్‌ని నిర్థారించడమే మిగిలింది.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఓ భారీ సెట్‌లో నాగార్జున, కృతీశెట్టిలపై డ్యూయెట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ రోజుతో అది పూర్తైపోతుంది. ఈ పాటతో మొత్తం షూటింగ్ కంప్లీటైపోతుంది కనుక సినిమాకి కూడా గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ ఓ ఫొటోని పోస్ట్ చేశారు నాగార్జున.
నాగచైతన్య, కృతి మాంచి హుషారుగా స్టెప్పులు వేస్తున్న స్టిల్ అది. తెల్లని పంచె, ఎర్రని కుర్తా, మెడలో పులిగోరు, కళ్లకి గాగుల్స్‌తో చిన బంగార్రాజు పాత్రలో నాగ్‌ని తలపిస్తున్నాడు చైతు. పసుపురంగు చీరకట్టు. ఆకుపచ్చ జాకెట్టు, మట్టి గాజులు, కాళ్లకి పట్టీలతో అచ్చమైన పల్లెపడుచులా ఆకట్టుకుంటోంది కృతి. ఇద్దరి జోడీ బాగుంది. ఇది అచ్చమైన సంక్రాంతి సినిమా కావడంతో ఎలాగైనా పొంగల్‌కి రిలీజ్ చేయాలని నాగార్జున ఆశపడ్డారు. అందుకు అనుగుణంగానే ప్లాన్డ్‌గా అడుగులు వేశారు.
శరవేగంగా షూటింగ్ కానిచ్చారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌తో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. సర్కారు వారి పాట, ఎఫ్ 3, భీమ్లానాయక్ లాంటి సినిమాలన్నీ వాయిదా పడటంతో సంక్రాంతికి బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకునే పనిలో పడ్డారు. మరి జనవరి 15కే ఫిక్సవుతారా లేదా అనేది అనౌన్స్‌మెంట్ వస్తే కానీ తెలీదు. ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వచ్చే చాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్.