సినీ పరిశ్రమలో తాను పెద్దగా ఎవరితోనూ కలవనని.. కానీ చిరంజీవిని కలుస్తానని.. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో ఆయనొకరని గతంలో ఓ సందర్భంలో చెప్పాడు బాలయ్య. వీరి అభిమానుల మధ్య ఎంత అంతరం ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరూ చాలా వరకు సన్నిహితంగానే కనిపిస్తారు. కానీ ఈ మధ్య ఎందుకో ఇద్దరి మధ్య అగాథం నెలకొంది. పరిశ్రమకు పెద్దగా ఉంటూ అన్ని కార్యక్రమాలనూ నడిపిస్తున్న చిరు మీద పరోక్షంగా బాలయ్య విమర్శలు చేస్తున్నాడు. ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు.
దీనికి బీజం ఆ మధ్య చిరంజీవి ఇంట్లో జరిగిన ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమం దగ్గర పడిందని బాలయ్య తాజాగా వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. చిరంజీవి ఇంట్లో జరిగిన ఆ వేడుకకు బాలయ్యను ఆహ్వానించలేదట. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే చెప్పాడు.
ఈ నెల 10న తన షష్టిపూర్తిని పురస్కరించుకుని బాలయ్య వరుసగా టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ చిరుతో సంబంధాల గురించి స్పందించాడు బాలయ్య.
గతంలో చిరు మీకు అత్యంత ఆప్త మిత్రుడు అన్నారు.. ఆయన షష్టిపూర్తి సందర్భంగా జరిగిన వేడుకల్లో డ్యాన్స్ కూడా చేశారు.. ఇంకా పలు సందర్భాల్లో సన్నిహితంగా ఉన్నారు.. మరి ఇప్పుడేమైంది అని యాంకర్ బాలయ్యను ప్రశ్నించగా.. 80వ దశకానికి చెందిన నటీనటులందరం ప్రతి సంవత్సరం కలిసే వాళ్లమని.. చెన్నై, బెంగళూరుల్లో జరిగిన వేడుకలకు తాను హాజరయ్యానని.. కానీ గత ఏడాది చిరంజీవి ఇంట్లోనే ఈ వేడుక జరగ్గా దానికి చిరు తనను ఆహ్వానించలేదని బాలయ్య అన్నాడు.
ఎక్కడెక్కడో జరిగిన వేడుకల్లో తాము కలిసి పాల్గొన్నామని.. కానీ చిరు ఇంట్లో జరిగిన వేడుకకు తనను ఎందుకు పిలవలేదో తనకు తెలియదని బాలయ్య అన్నాడు. తాను ఇలాంటివి పట్టించుకోనని.. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలన్నది తన అభిమతమని బాలయ్య చెప్పాడు. మరి ఆ కోపంతోనే బాలయ్య ఇప్పుడు చిరు మీద పరోక్షలు విమర్శలు చేస్తున్నాడనుకోవాలా?