అల్లు అరవింద్‌తో అల్లు బాబీ ఫైట్?

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా అల్లు అరవింద్ వారి ‘గీతా ఆర్ట్స్-2’, యువి క్రియేషన్స్ ఉమ్మడి భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

సమ్మర్ సీజన్ ఆరంభం కాబట్టి మార్చి చివరి రెండు వారాల్లో సినిమాల రిలీజ్‌కు గట్టి పోటీనే ఉంటుంది. ‘పక్కా కమర్షియల్’కు కూడా పోటీ లేకుండా ఏమీ లేదు. ఇదే తేదీన విడుదల కోసం ఓ కొత్త సినిమా సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ సినిమా.. గని కావడం విశేషం.

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 10నే రిలీజ్ చేయాలనుకున్నారు. తర్వాత 24కు వాయిదా వేశారు. కానీ ఏం జరిగిందో ఏమో మళ్లీ వాయిదా తప్పలేదు. మంచి డేట్ చూసి తర్వాత విడుదల చేస్తామని చివరగా ప్రకటన ఇచ్చారు.

ఐతే ఇప్పుడు చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ‘గని’ని మార్చి 18న విడుదల చేయాలని చూస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ డేట్‌కు సినిమా ఫిక్సయినట్లే చెబుతున్నారు. ఐతే ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఇక్కడ ప్రస్తావనార్హం. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ ఈ చిత్రంతోనే పూర్తి స్థాయి నిర్మాతగా పరిచయం అవుతున్నాడు.

మరి ‘పక్కా కమర్షియల్’ మార్చి 18కి ఫిక్సయిన సంగతి తెలిసి కూడా ‘గని’ని అదే తేదీకి ఖరారు చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే రెండూ మీడియం రేంజ్ సినిమాలే.

పైగా వేసవి ఆరంభంలో వస్తున్నాయి కాబట్టి రిస్క్ తక్కువే అని తండ్రీ కొడుకుల సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేసేస్తారా లేక ‘గని’ కోసమని ‘పక్కా కమర్షియల్’ను మరో తేదీకి వాయిదా వేస్తారా అన్నది చూడాలి. రెండూ ఒకే రోజు వస్తే మాత్రం తండ్రీ కొడుకులైన ఇద్దరు నిర్మాతల సినిమాలు ఒకే రోజు పోటీ పడ్డ రికార్డు అవుతుందేమో.