ఈమధ్య పీరియాడిక్ ఫిల్మ్స్ ఎక్కువవుతున్నాయి. ఓవైపు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ రెడీ చేశారు. ఇటు నాని కూడా ‘శ్యామ్ సింగ రాయ్’గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ఒక పీరియాడిక్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో. రీసెంట్‌గా ‘పుష్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బన్నీ. దీని తర్వాత పుష్ప సెకెండ్ పార్ట్ చేస్తాడని అందరూ అనుకున్నారు.
అయితే మొదటి పార్ట్ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నా రివ్యూలు కాస్త నెగిటివ్‌గా ఉన్నాయి. అనుకున్న స్థాయిలో సినిమా ఆకట్టుకోలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని సెకెండ్ పార్ట్ చేయాలనుకుంటున్నాడట బన్నీ. ఈ గ్యాప్‌లో వేరే సినిమా చేయబోతున్నాడట. దాన్ని డైరెక్ట్ చేసే చాన్స్ బోయపాటికి ఇచ్చినట్లు తెలుస్తోంది.
అఖండ భారీ విజయం ఇచ్చిన జోష్‌లో ఉన్న బోయపాటి.. రీసెంట్‌గా బన్నీని కలిసి ఓ కథ చెప్పాడట. ఇది ఓ పీరియాడిక్ కాన్సెప్ట్ అని సమాచారం. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా ఉంటుందట. ఎంత ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీయే అయినా బోయపాటి స్టైల్ మాస్ గ్యారంటీ కదా. అందుకే చెప్పగానే బన్నీకి లైన్ నచ్చేసిందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా అంటున్నారు.
నిజానికి బన్నీ కోసం ఐకాన్ సినిమా లైన్‌లో ఉంది. కానీ ఎందుకనో ఆ మూవీ విషయంలో తను ముందడుగు వేయడం లేదు. అలా అని ప్రాజెక్ట్ క్యాన్సిలయ్యిందనీ ఒప్పుకోవడం లేదు. దాన్ని అలా పక్కన ఉంచి మిగతా సినిమాలు చేసేస్తున్నాడు. ఈసారి కూడా అదే చేస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ బోయపాటితో ‘సరైనోడు’ సినిమా చేశాడు బన్నీ. అది మంచి విజయాన్నే సాధించింది. తనతో మరోసారి మూవీ చేయడమనేది నిజమైతే వీరి కాంబోలో మరో మాంచి ఎంటర్‌టైనర్ వచ్చే చాన్స్ ఉందన్నమాటే.