‘ఆర్ఆర్ఆర్’ కారణంగా ఆల్రెడీ ‘పుష్ప’కు ప్రమోషన్ల పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘పుష్ప’ ట్రైలర్ రిలీజైన మూడు రోజుల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ లాంచ్ చేయడంతో ఫోకస్ మొత్తం దాని మీదికి వెళ్లిపోయింది. ట్రైలర్ లాంచ్ తర్వాత రెండు మూడు రోజుల పాటు ‘ఆర్ఆర్ఆర్’ టీం వరుసగా ప్రమోషన్లతో హోరెత్తించడంతో ‘పుష్ప’ అసలు వార్తల్లోనే లేకుండా పోయింది. తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ టీం కొంచెం వెనక్కి తగ్గడంతో ‘పుష్ప’ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రం చుట్టూనే చర్చలన్నీ సాగాయి.
ఐతే ఇప్పుడు మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ టీం ‘పుష్ప’ మీది నుంచి ప్రేక్షకుల దృఫ్టిని మళ్లిస్తోంది. ముంబయిలో ఆదివారం జరగబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ ఉత్తరాదిన ‘పుష్ప’కు ఇబ్బందులు తెచ్చేలా ఉంది. ఈ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా రాబోతుండటం, ఈవెంట్ భారీ స్థాయిలో చేస్తుండటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. కలెక్షన్ల పరంగా కూడా ‘పుష్ప’కు ‘ఆర్ఆర్ఆర్’ గండి కొడుతుండటం గమనార్హం. ఐతే ఆ గండి పడుతోంది ఇండియాలో కాదు.. యుఎస్‌లో. యుఎస్‌లో భారీ చిత్రాల విడుదలకు వారం, రెండు వారాల ముందే బుకింగ్స్ మొదలవుతుంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ మీద ఉన్న అంచనాల దృష్ట్యా మూడు వారాల ముందే బుకింగ్స్ మొదలుపెట్టేశారు. ‘పుష్ప’ రిలీజ్ రోజు నుంచే కొన్ని స్క్రీన్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇలా పెట్టడం ఆలస్యం అలా టికెట్లు అయిపోతున్నాయి. 20వ తారీఖు నుంచి మొత్తం అన్ని స్క్రీన్లలో బుకింగ్స్ మొదలవుతున్నాయి. సినిమా స్థాయికి తగ్గట్లే రేట్లు కూడా కాస్త ఎక్కువే.
ఐతే ఈ చిత్రం కోసం ఒక్కో టికెట్‌కు 25-35 డాలర్ల మధ్య ఖర్చు చేస్తున్న ఎన్నారైలు.. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘పుష్ప’ మీద మళ్లీ బడ్జెట్ పెట్టడానికి కొంచెం సందేహిస్తారనడంలో సందేహం లేదు. అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ రావడం కూడా మైనస్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ బుకింగ్స్ ఓపెన్ కాకుంటే.. ‘పుష్ప’ మీదే వాళ్ల ఫోకస్ ఉండేది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా కీలకమైన రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఇబ్బందిగా మారింది. దీని వల్ల కచ్చితంగా ‘పుష్ప’ కలెక్షన్లపై ప్రభావం పడుతోందంటున్నారు ట్రేడ్ పండిట్లు.