భలే భలే.. వర్మ మళ్లీ పాటందుకున్నాడు

సినిమా తీయడంలో వర్మకి తెలిసినన్ని టెక్నిక్స్ ఎవరికీ తెలియవు. మనసు పెట్టి తీశాడో అద్భుతమైన సినిమాలు రాక మానవు. ఇది అందరికీ తెలిసిన, అందరూ ఒప్పుకునే వాస్తవం. కానీ వర్మ మైండ్ పూర్తిగా డీవియేట్ అయిపోయి చాలా కాలమే అయ్యింది. కేవలం వ్యక్తుల మీద, ఇష్యూస్‌ మీద కాన్సన్‌ట్రేట్ చేసి సినిమాలు తీస్తున్నాడే తప్ప.. తన స్టైల్ ఏంటి, తన మార్క్ ఏంటదేని వర్మ ఎప్పుడో విస్మరించాడు. తన మనసుకు నచ్చిన సినిమాలేవో తీసుకుంటూ పోతున్నాడు.

ప్రస్తుతం ‘కొండా’ సినిమా తీయడంలో బిజీగా ఉన్నాడు వర్మ. అదిత్ అరుణ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాని మల్లారెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొండా మురళి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నాడు వర్మ. రీసెంట్‌గా వరంగల్‌లో మూవీని లాంచ్ కూడా చేశారు. ఏవో ఆటంకాలు రావడంతో షూటింగ్ ఆగింది. త్వరలోనే తిరిగి మొదలుపెట్టబోతున్నారు. తాజాగా ఈ మూవీలోని ‘భలే భలే’ అనే విప్లవ గీతాన్ని రిలీజ్ చేశాడు వర్మ.

ఈ పాటను నల్గొండ గద్దర్‌‌తో కలిసి వర్మయే పాడటం విశేషం. నిజానికి వర్మ పెద్ద సింగర్‌‌ కాదు. అయినా కూడా అప్పుడప్పుడు ఒక్కో పాట వదులుతుంటాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో తన గొంతు వినిపించాడు. ఇప్పుడు మరోసారి. సాధారణంగా విప్లవగీతమంటే ఆవేశంగా ఉంటుంది. ఆలోచింపజేస్తుంది. సమాజంలోని చెడుపై విల్లు ఎక్కుపెట్టి పాట రూపంలో బాణం సంధించినట్టుగా అనిపిస్తుంది. అయితే వర్మ పాట మాత్రం కాస్త హింసాత్మకంగా ఉంది.. ఆయన సినిమాల్లాగే.

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ ఎమోషనల్‌గా మొదలైన ఈ పాట ముందుకెళ్లేకొద్దీ చంపుతా, నరుకుతా అంటూ వయొలెంట్‌గా మారింది. కట్టి కొట్టి చంపుడా.. కత్తితోటి పొడుచుడా.. గొడ్డలితో నరుకుడా.. బాంబులతో పేల్చుడా అంటూ సాగిన ఈ పాటలో ఒకచోట బూతులు కూడా తిట్టాడు వర్మ. హింసను తెరపై చూపించడంలో వర్మని కొట్టేవాడే లేడు. ఈసారి దాన్ని పాటతోనే రుచి చూపించాడంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో.