బాల‌య్య ధాటిని ఆ సినిమా త‌ట్టుకుంటుందా?

అఖండ‌.. అఖండ‌.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కులున్న ప్ర‌తి చోటా ఈ పేరే మార్మోగుతోంది. ఈ గురువారం భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. మిక్స్‌డ్ రివ్యూలు వ‌చ్చినా, కామ‌న్ ఆడియ‌న్స్ నుంచి కూడా ఫీడ్ బ్యాక్ ఏమంత బాలేకున్నా.. ఈ చిత్రం వ‌సూళ్ల మోత మోగిస్తోంది. తొలి రోజు అన్ని సెంట‌ర్ల‌లో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ర‌న్ అయింది అఖండ‌. రెండో రోజు కూడా క‌లెక్ష‌న్లు పెద్ద‌గా ఏమీ డ్రాప్ కాలేదు. మెజారిటీ థియేట‌ర్లలో హౌస్ ఫుల్స్ కొన‌సాగుతున్నాయి.

బాల‌య్య అభిమానులు మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ సినిమా చూస్తున్నారు. మాస్ ప్రేక్ష‌కుల నుంచి ఈ సినిమా చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ వీకెండ్ అంతా కూడా అఖండ హ‌వా కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. శుక్ర‌వారం మోహ‌న్ లాల్ న‌టించిన‌ మ‌ల‌యాళ డ‌బ్బింగ్ సినిమా మ‌ర‌క్కార్ తెలుగులో రిలీజ్ కాగా.. దీని ప‌ట్ల మ‌న ప్రేక్ష‌కుల్లో పెద్ద‌గా ఆస‌క్తి క‌నిపించ‌లేదు. ఈ చిత్రానికి ఉద‌యం చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి. మ‌ధ్యాహ్నం నుంచి షోలు ప‌డ్డా.. ప్రేక్ష‌కుల నుంచి స‌రైన స్పంద‌న లేదు. దీంతో మ‌ర‌క్కార్ షోల‌ను క‌ట్ చేసి అఖండ‌నే న‌డిపిస్తున్నారు.

కాగా శ‌నివారం చ‌డీచ‌ప్పుడు లేకుండా ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతోంది. అదే.. స్కైలాబ్. నిత్య‌మీన‌న్, స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో విశ్వ‌క్ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన వినూత్న చిత్ర‌మిది. నిత్య మీన‌న్ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రం భిన్న‌మైన ప్రోమోల‌తో ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షించింది. కొత్త త‌ర‌హా సినిమాలు కోరుకునే వాళ్ల‌కు ఈ సినిమా మంచి ఛాయిస్ లాగే క‌నిపిస్తోంది. కాక‌పోతే అఖండ ప్రభంజ‌నాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే ఈ సినిమాకు చాలా మంచి టాక్ రావాలి. మ‌రి ఈ చిన్న సినిమాకు ఎలాంటి టాక్ వ‌స్తుందో.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో చూడాలి.