సిద్ధ పాత్రపై చరణ్ క్లారిటీ

‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న సిద్ధ పాత్ర విషయంలో మెగా అభిమానులే కాదు.. సగటు సినీ ప్రేక్షకులందరూ అమితాసక్తితో ఉన్నారు. చిరు-చరణ్‌లను స్క్రీన్ మీద చూడటం ఎవరికైనా ఆనందాన్నిచ్చే విషయమే. ఇంతకుముందు ‘మగధీర’, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాల్లో కొన్ని నిమిషాలు మాత్రమే ఈ తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ‘ఆచార్య’ సంగతి అలా కాదు. ఇందులో చరణ్‌ ఓ కీలక పాత్రనే పోషిస్తున్నాడు. దాని నిడివి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండబోతోందని అర్థమవుతోంది.

ఇటీవలే రిలీజ్ చేసిన సిద్ధ పాత్ర తాలూకు టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూల ో చరణ్ ఈ పాత్ర గురించి మరిన్ని విశేషాలు వెల్లడించాడు. ఆ కబుర్లు తన పాత్రపై, సినిమాపై మరింత అంచనాలు పెంచేలాగే ఉన్నాయి.

సిద్ధ పాత్రను ముందు క్యామియో రోల్ అనే అనుకున్నామని.. తర్వాత దాని నిడివి పెరిగి మొత్తంగా 40 నిమిషాల పాటు ఆ పాత్ర సినిమాలో కనిపిస్తుందని చరణ్ వెల్లడించాడు. ఈ పాత్ర ప్రథమార్ధంలో ఉండదని.. ద్వితీయార్ధంలో ప్రవేశిస్తుందని చరణ్ చెప్పాడు. ద్వితీయార్ధం మొత్తం ఈ పాత్ర ఉన్న ఫీలింగ్ కలుగుతుందని.. కథలో ఈ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చరణ్ తెలిపాడు. ఆచార్య పాత్ర మొదలుపెట్టే ఒక పెద్ద మూమెంట్‌ను సిద్ధ క్యారెక్టర్ ముందుకు తీసుకెళ్తుందని చరణ్ వెల్లడించాడు.

తనది ఇందులో చిరు వారసత్వాన్ని కొనసాగించే కామ్రేడ్ పాత్ర అని కూడా చరణ్ తెలిపాడు. ఈ మాటలు మెగా అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచేవే. ఇటీవల రిలీజ్ చేసిన సిద్ధ టీజర్లో పులి-పులి పిల్లల్ని చూపించి ఆ వెంటనే చిరు-చరణ్‌లను చూపించిన షాట్ వారికి మామూలు హైని ఇవ్వలేదు. సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిందా టీజర్. సినిమాలో వీళ్లిద్దరి మీదా ఒక పాట కూడా ఉంటుందని కొరటాల చెబుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.