మరక్కార్.. ఇప్పుడు భారతీయ సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం. ఓ మలయాళ సినిమా పట్ల మిగతా భాషల వాళ్లూ ఇంత ఆసక్తిని ప్రదర్శించడం అరుదైన విషయమే. అక్కడ గొప్ప గొప్ప సినిమాలే వస్తాయి కానీ.. మలయాళం అంత ఫెమిలియర్‌గా అనిపించే భాష కాకపోవడం, అలాగే అక్కడ సినిమాల మార్కెట్ రీచ్ చాలా తక్కువ కావడం వల్ల వాటి గురించి పెద్దగా చర్చ జరగదు.
కానీ గత కొన్నేళ్లలో ఓటీటీల పుణ్యమా అని మలయాళ సినిమాలకు జనాలు బాగానే అలవాటు పడ్డారు. వాటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్, ప్రియదర్శన్‌ల క్రేజీ కాంబినేషన్లో.. ‘బాహుబలి’ స్థాయి భారీతనంతో.. హాలీవుడ్ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్’ను పోలిన చిత్రంలా కనిపిస్తున్న ‘మరక్కార్’ మీద అన్ని భాషల వాళ్లకూ ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే 2021 సంవత్సరానికి ఉత్తమ జాతీయ చిత్రంగా నిలవడం, ప్రోమోలు అద్భుతంగా అనిపించడం సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం.
మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గురువారం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం రిలీజవుతున్న ‘మరక్కార్’ రిలీజ్ కంటే ముందే అరుదైన రికార్డు నెలకొల్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకుందట. ఈ విషయాన్ని చిత్ర బృందం పోస్టర్ల మీదే ప్రకటించింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా కూడా ‘మరక్కార్’ను పేర్కొన్నారు.
ఇదే నిజమైతే ఇదొక అద్భుతమైన రికార్డే. ఒక మలయాళ సినిమా ఈ ఘనత సాధించడం ఆశ్చర్యమే. వరల్డ్ వైడ్ 4100 థియేటర్లలో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజవుతోంది. విదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేశారు. రోజుకు 16 వేల షోలు పడబోతున్నాయట ఈ వీకెండ్లో. సినిమాకు మంచి టాక్ వస్తే కమర్షియల్‌గా మలయాళ సినిమా రేంజ్ ఒక్కసారిగా ఎంతో పెరిగిపోవడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates