ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలలో చూడనటువంటి విపత్తు ఈ మధ్యకాలంలో ఏపీ చవిచూసింది. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. తిరుపతిని గత కొన్ని దశాబ్దాలలో చూడని జల విలయం చుట్టేసింది. అయితే ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేమున్నామని అండగా నిలబడటానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది.
ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదలు కారణంగా నష్టపోయిన వాళ్లకు తనవంతు సహాయంగా.. ఇప్పటికే గీతా ఆర్ట్స్ తరఫున నిర్మాత అల్లు అరవింద్ 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు.
ఇప్పుడు ఈ వరుసలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా రూ. 25లక్షలను ఇస్తున్నట్లుగా తెలియజేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించిపోయాను. వారు కోలుకోవడానికి నా వంతు బాధ్యతగా రూ. 25 లక్షలను అందిస్తున్నాను..’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
ఇక, ఇదే అంశంపై సూపర్ స్టార్ మహేష్ కూడా రెస్పాండ్ అయ్యారు. వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 25 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లుగా తెలియజేశారు.
‘‘ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వినాశకరమైన వరదల కారణంగా నష్టపోయిన వారికి సహాయం అందించే ప్రయత్నంలో నా వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు అందిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను..’’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates