ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిన సంగతి తెలిసిందే. ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సిరివెన్నెలకు అరుదైన గౌరవాన్ని తెలంగాణ ప్రకటించింది. సీతారామశాస్త్రి వైద్య ఖర్చులను తామే భరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
అంతేకాదు, ప్రభుత్వ లాంఛనాలతో సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహిస్తామని తలసాని తెలిపారు. మరోవైపు, ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని కడసారి సందర్శించేందుకు పలువురు సినీ ప్రముఖులతోపాటు, సిరివెన్నెల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు హిందూ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మధ్యాహ్నం 1:00 కు సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే, ఫిలిం ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకూ సిరివెన్నెల అంతిమయాత్ర మొదలైంది. అంతిమయాత్రలో పలువురు సినీ ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు పాల్గొననున్నారు. అంతిమయాత్ర వెంబడి వేలాది మంది సిరివెన్నెల అభిమానులు తరలివస్తున్నారు.