నందమూరి బాలకృష్ణ గత మూడు సినిమాలు ఎంత దారుణమైన ఫలితాన్నందుకున్నాయో తెలిసిందే. 2019లో యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు సినిమాలతో పాటు ‘రూలర్’ కూడా రిలీజై ప్రేక్షకుల తిరస్కారానికి గురవడం విదితమే. ‘రూలర్’ టైంకి బాలయ్య మార్కెట్ దారుణాతి దారుణంగా పడిపోయింది.
ఈ స్థితి నుంచి బాలయ్య ఎలా కోలుకుంటాడో అనుకున్నారు కానీ.. గతంలో బాలయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉండగానే వచ్చి ‘సింహా’, లెజెండ్’ చిత్రాలతో ఆయన కెరీర్‌కు పునర్వైభవం తీసుకొచ్చిన బోయపాటి శ్రీను.. ఇంకోసారి బాలయ్యను రక్షించడానికి రెడీ అయ్యాడు. వీరి క్రేజీ కాంబినేషన్లో మొదలైన ‘అఖండ’పై మొదట్లో పెద్దగా అంచనాల్లేవు కానీ.. రిలీజ్ టైంకి హైప్ పీక్స్‌కు చేరుకుంది. మాస్ ప్రేక్షకులకు పండగలా అనిపిస్తున్న ఈ చిత్రం ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత రానున్న తొలి భారీ చిత్రం కావడంతో ట్రేడ్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. కొన్ని వారాల నుంచి సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోతున్న టైంలో అఖండ దిగుతుండటం కూడా కలిసొచ్చే అంశమే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాను ఆడించబోతున్నారు. బాలయ్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా ఏపీలో బాలయ్య సినిమాకు భారీగా థియేటర్లు దక్కుతుంటాయి కానీ.. ఈసారి నైజాంలో సైతం చాలా పెద్ద స్థాయిలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇక యుఎస్‌లోనూ ‘అఖండ’ మోత మామూలుగా లేదు. ఏకంగా 500కు పైగా స్క్రీన్లలో సినిమా రిలీజవుతోంది. అక్కడ కరోనా తర్వాత ప్రిమియర్స్, ఓవరాల్ కలెక్షన్ల రికార్డులను నెలకొల్పిన ‘లవ్ స్టోరి’ని ‘అఖండ’ దాటేసినా ఆశ్చర్యం లేదు. కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. ఎన్ఆర్ఐ బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని షోలకు షోలను బుక్ చేసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉన్నప్పటికీ ఈ సినిమా బాలయ్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతుందనే అంచనా వేస్తున్నారు