రామ్ చరణ్, అలియాపై ప్రమోషనల్ సాంగ్!

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పనులన్నీ ఎప్పుడో పూర్తి చేసేశారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా దాదాపు పూర్తయినట్లే. సినిమా నిడివి మూడు గంటల పాటు ఉంటుందని సమాచారం. జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. దీంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. సినిమా నుంచి టీజర్లు, పాటలను విడుదల చేస్తూ.. రోజురోజుకి అంచనాలను పెంచేస్తున్నారు. డిసెంబర్ 3న సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది.

ఇలాంటి సమయంలో రాజమౌళి మరోసారి సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి ఓ ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించాలని భావిస్తున్నారు. రామ్ చరణ్, అలియాభట్ ల మీదే ఈ ప్రమోషనల్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. సినిమాలో వారిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ పెద్దగా ఉండదట. దీంతో ఇద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తే.. బాలీవుడ్ మార్కెట్ లో మరింత ప్రమోట్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. 

కానీ ట్రైలర్ కి వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఓ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ట్రైలర్ ఇంటర్నేషనల్ రేంజ్ లో వైరల్ అయితే.. ప్రమోషనల్ సాంగ్ ఐడియాను పక్కన పెట్టేస్తారట. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు దాదాపు రూ.700 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. నిజానికి కోవిడ్ గనుక లేకపోతే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్ విషయంలో ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటుంది.