శిల్పా చౌదరి బాధితుల లిస్టులో టాలీవుడ్ అగ్ర హీరో కుటుంబం

టాలీవుడ్ ను ఏలే అగ్రహీరోల్లో ఒకరు. ఆయన సినిమాల్లో కరుడుగట్టిన విలన్లను చిత్రవిచిత్రంగా ఉతికిఆరేస్తుంటారు. రీల్ లైఫ్ లో ఫిజికల్ గానే కాదు.. మెంటల్ గేమ్ లతో ప్రతినాయకులకు చుక్కలు చూపించే ఆ హీరో.. రియల్ లైఫ్ లో మాత్రం తన కుటుంబంలోని వారు.. ఒక చిట్టీల ఆంటీ దెబ్బకు కోట్లాది రూపాయిలు మోసపోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది. సినీ.. రాజకీయ ప్రముఖులతో పాటు.. సొసైటీలోని అత్యంత హైఫై వర్గాలకు చెందిన వారి నుంచి డబ్బుల్ని పెట్టుబడిగా.. అప్పుగా.. కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసి మరీ బురిడీ కొట్టించిన శిల్పా చౌదరి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆమె బాధితుల జాబితాలో పేరున్న ప్రముఖులు పలువురు ఉండటం విశేషం.

పలు రంగాలకు చెందిన ప్రముఖులు పోగొట్టుకున్న మొత్తాల్ని చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. జస్ట్ ఉదాహరణగా కొన్ని ఫిగర్లను ఇప్పుడు మేం మీకు చెబుతాం. అవేమీ ర్యాంకులు కావు.. కిట్టీ పార్టీ ఆంటీ కొల్ల గొట్టిన కోట్లు. 2.. 5..6..12.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాతాండంత ఉంటుంది. ఇంత భారీ మొత్తాల్ని ఎలా ఇచ్చారు? ఏ నమ్మకంతో ఇచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. శిల్పా చౌదరి మోసాల్ని మీడియా ద్వారా తెలుసుకుంటున్న వారు.. ఇప్పుడు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. తాము ఇచ్చిన భారీ మొత్తాల గురించి ఏకరువు పెడుతున్నారు.

అనేక మంది ప్రముఖుల భార్యలు.. చెల్లెళ్లు.. కోడళ్లు.. శిల్పా చౌదరి బాధితులుగా మారారు. శాంపిల్ గా చెప్పాల్సిన వస్తే.. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోకు చెందిన కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి ఏకంగా రూ.12 కోట్లకు పైనే కుచ్చు టోపీ పెట్టినట్లుగా చెబుతున్నారు. మోసపోయిన కుటుంబ సభ్యులు ఇద్దరూ సదరు టాలీవుడ్ హీరోకు చాలా చాలా దగ్గరివారు కావటం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలోనూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.6 కోట్లు చొప్పున వసూలు చేసిన ఈ కిలేడీ.. మరో సీనియర్ నటుడి వద్ద నుంచి రూ.2.4కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల కాలంలో టాలీవుడ్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో తరచూ వినిపించే పేర్లలో ఆయన పేరు ఒకటిగా చెబుతున్నారు. అంతేకాదు.. ఒక పోలీసు ఉన్నతాధికారి కోడలు రూ.6కోట్లు.. కీలక స్థానంలో ఉన్న న్యాయమూర్తి కుటుంబ సభ్యులురూ.5కోట్లు వ్యాపారంలో పెట్టుబడి కింద శిల్పా చౌదరికి ఇచ్చి నట్టేట మునిగిపోయారు. సంపన్న వర్గాలు.. సొసైటీలో హైక్లాస్ వారికి కిట్టీ పార్టీల పేరుతో గాలం వేసే శిల్పా చౌదరికి తాను బస చేసిన సిగ్నేచర్ విల్లాకు తరచూ ఆహ్వానించేవారు. కిట్టీ పార్టీలతో పాటు పేకాట దందా కూడా నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఆమె ఏర్పాటు చేసిన పార్టీలో అతిధులకు అందించే మద్యం బాటిల్ ఖరీదే రూ.లక్షకు పైనే ఉంటుందంటే.. సదరు పార్టీ ఎంత విలాసంగా సాగేదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.