నాని పంచ్.. టాలీవుడ్ పెద్ద‌ల‌కే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ టాలీవుడ్‌ను ఒక ర‌క‌మైన సంక్షోభంలోకే నెట్టే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏపీలో జ‌నాల‌కున్న సినిమా పిచ్చి ఎలాంటిదో తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ  ఆదాయం వ‌చ్చేది ఏపీ నుంచే. అలాంటి చోట్ల టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ తేవ‌డం, ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిన ప‌రిస్థితుల్లో ఎన్నో ఏళ్ల కింద‌టి రేట్ల‌ను అమ‌లు చేయాల‌న‌డం.. అస‌లే క‌రోనా వ‌ల్ల దారుణంగా దెబ్బ తిన్న థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను మ‌రింత దెబ్బ కొట్టేదే.

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఏపీలో ఎగ్జిబిట‌ర్ వ్య‌వ‌స్థే పెను ముప్పును ఎదుర్కొంటోంది. ఆ ప్ర‌భావం మొత్తం సినిమా రంగం మీద ప‌డుతోంది. అయినా స‌రే.. దీని గురించి గ‌ట్టిగా గ‌ళం వినిపించే, పోరాడే స్థితిలో సినీ పెద్ద‌లు లేరు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, సురేష్ బాబు లాంటి ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే దీని గురించి మాట్లాడారు. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఆ మ‌ధ్య నాని, కార్తికేయ లాంటి ఒక‌రిద్ద‌రు యువ క‌థానాయ‌కులు స్పందించారు. మిగ‌తా వాళ్లంతా గ‌ప్‌చుప్.

ఈ నేప‌థ్యంలో నాని ప‌రోక్షంగా టాలీవుడ్ పెద్ద‌ల‌కు ఒక చుర‌క అంటించాడు. స్కైల్యాబ్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన నాని టికెట్ల రేట్లు, థియేట‌ర్ల గురించి తానేమీ మాట్లాడ‌ను అంటూనే.. ఒక పంచ్ వేశాడు. ఇంత‌కుముందు స‌త్య‌దేవ్ న‌టించిన తిమ్మ‌ర‌సు మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చిన‌పుడే థియేట‌ర్ల స‌మ‌స్య గురించి ప్ర‌స్తావించాడు నాని. ఏపీలో టికెట్ల రేట్లతో త‌లెత్తిన ఇబ్బంది గురించి కూడా మాట్లాడాడ‌త‌ను. అప్పుడా వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

ఐతే అప్పుడ‌లా మాట్లాడి, ఆ త‌ర్వాత త‌న సినిమా ట‌క్ జ‌గ‌దీష్‌ను ఓటీటీలో రిలీజ్ చేయ‌డాన్ని ఎగ్జిబిట‌ర్లు త‌ప్పుబ‌ట్ట‌డం.. అత‌డికి వార్నింగ్ ఇవ్వ‌డం దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నాని తాజాగా స‌త్య‌దేవ్‌ను ఉద్దేశించి మాట్లాడి ఇంత‌కుముందు మాట్లాడితే అది హాట్ టాపిక్ అయింద‌ని, ఈసారి టికెట్ల రేట్లు, థియేట‌ర్ల గురించి మాట్లాడ‌న‌ని.. అప్పుడు తాను మాట్లాడాన‌ని, ఇప్పుడు మిగ‌తా వాళ్లు మాట్లాడ‌తారేమో చూద్దాం అని అన్నాడు. త‌ద్వారా ఇప్ప‌టికైనా సినీ పెద్ద‌లు గ‌ళం విప్పి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చెయ్యాల‌ని చెప్ప‌క‌నే చెప్పాడు నాని. మ‌రి సోకాల్డ్ పెద్ద‌లు ఏమేర స్పందిస్తారో చూడాలి.