‘రాధేశ్యామ్’ను ఎవరూ ఓన్ చేసుకోరేంటి?

‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఓవైపు అల్లు అర్జున్.. మరోవైపు నందమూరి బాలకృష్ణ.. ఇంకోవైపు దర్శకుడు బోయపాటి శ్రీను.. ఇంకా పలువురు కరోనా కష్టాల నుంచి బయటపడుతున్న తెలుగు సినిమా మరింతగా పుంజుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఈ గురువారం రాబోతున్న ‘అఖండ’ పునర్వైభవానికి తెర తీయాలని.. ఆ తర్వాత ‘పుష్ప’ కూడా ఇరగాడేయాలని.. ఆపై ‘ఆర్ఆర్ఆర్’ కూడా థియేటర్లను కళకళలాడించాలని కోరుుకున్నారు.

బాలయ్య, అల్లు అర్జున్ అయితే పర్టికులర్‌గా ఈ సినిమాల పేర్లు ఎత్తి ఒకరి సినిమా గురించి ఇంకొకరు చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. కానీ సంక్రాంతికే మరో భారీ చిత్రం ‘రాధేశ్యామ్’ షెడ్యూల్ అయిన విషయాన్ని వీరితో సహా అందరూ మరిచిపోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘భీమ్లా నాయక్’ కూడా సంక్రాంతి రేసులో ఉన్నప్పటికీ.. దాని మీద కాస్త సందిగ్ధత కొనసాగుతోంది. పైగా ఆ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసే విషయంలో కొంత వివాదం కూడా ఉంది.

కానీ ‘రాధేశ్యామ్’ సంగతి అలా కాదు. ఆ చిత్రం సంక్రాంతి రిలీజ్‌ను చాలా ముందే కన్ఫమ్ చేసుకుంది. పక్కాగా జనవరి 14నే ‘రాధేశ్యామ్’ను రిలీజ్ చేయబోతున్నారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమాకు గర్వకారణం నిలిచాడు కాబట్టి రాజమౌళి నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ను కూడా అందరూ ఓన్ చేసుకోవడం.. దాని పట్ల కూడా ప్రౌడ్‌గా ఫీలవుతూ దాన్ని అందరూ సపోర్ట్ చేస్తుండొచ్చు. కానీ ‘బాహుబలి’తో ప్రభాస్ సైతం టాలీవుడ్‌కు గర్వకారణంగానే నిలిచాడు. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్‌గా ఎదిగి మనవాళ్లు గొప్పగా చెప్పుకునే స్థాయిని అందుకున్నాడు.

కానీ, ప్రభాస్ చిత్రాలను రాజమౌళి సినిమాల్లా ఎవరూ ఓన్ చేసుకోవట్లేదు. ‘అఖండ’ ఈవెంట్ అనే కాదు.. మరెక్కడా కూడా ఎవరూ పాన్ ఇండియా లెవెల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న ‘రాధేశ్యామ్’ ప్రస్తావన ఉండట్లేదు. అసలు దాన్ని తెలుగు సినిమాలా కాకుండా బాలీవుడ్ మూవీలా చూస్తున్నారా అన్న డౌట్లు కొడుతున్నాయి. బేసిగ్గా ‘రాధేశ్యామ్’ టీం ప్రమోషన్ల మీద దృష్టిపెట్టకపోవడం, సినిమాను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలబెట్టకపోవడం, సినిమాపై లో బజ్ ఉండటం కూడా ఈ పరిస్థితికి ఓ కారణం అని చెప్పొచ్చు.