కమల్ హాసన్‌కి కరోనా సోకిందన్న వార్త పొలిటికల్‌గా ఎలాంటి ప్రభావం చూపించిందో తెలీదు కానీ.. సినీ పరిశ్రమని మాత్రం కలవరపెట్టింది. ఎందుకంటే ‘విక్రమ్’ మూవీ సెట్స్‌పై ఉంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈ బ్రేక్ ఊహించనిది. కాకపోతే ఇతర ఆర్టిస్టులతో షూటింగ్‌ని మేనేజ్ చేయొచ్చు. కానీ మేనేజ్ చేయడం కష్టమయ్యే విషయం ఒకటి ఉంది. అదే తమిళ బిగ్ బాస్ షో. కమల్ హోస్ట్ చేస్తున్న ఈ షో మాంచి రసపట్టులో ఉంది. ఇలాంటి సమయంలో కమల్ దూరంగా ఉండటం కంగారుపెట్టే విషయమే. ఐసొలేషన్ అంటే మినిమమ్ పద్నాలుగు రోజులు కమల్ షూట్‌కి రారు. మరి వీకెండ్ ఎపిసోడ్ ఎలా?
దీనికో మంచి ప్రత్యామ్నాయం కనిపెట్టారు చానెల్ వారు. ఈవారం హోస్ట్‌గా ఓ గెస్ట్‌ని తీసుకు రాబోతున్నారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు.. శ్రుతీహాసన్. తండ్రి ప్లేస్‌లో శ్రుతి వచ్చి ఈ వారం హౌస్‌మేట్స్‌తో ఓ ఆట ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తోందట చానెల్ యాజమాన్యం. దీనివల్ల కమల్ లేని లోటు తెలియకుండా చేయడమే కాక, షోకి కాస్త గ్లామర్ యాడ్ చేసినట్టు కూడా అవుతుందని వారి ప్లాన్.
గతంలో తెలుగులోనూ ఇలాంటిది జరిగింది. బిగ్‌బాస్ సీజన్ 4 నడుస్తున్నప్పుడు షూటింగ్ కోసం అబ్రాడ్ వెళ్లారు హోస్ట్ నాగార్జున. అప్పుడు ఆయన కోడలు సమంత వచ్చి హోస్ట్ చేసింది. మామగారి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడమే కాదు.. అద్భుతమైన టీఆర్పీని కూడా రాబట్టింది. రమ్యకృష్ణ కూడా ఓ సమయంలో హోస్ట్ చేయడం జరిగింది కానీ, స్వయంగా నాగ్ కోడలు రావడమనేది ప్లస్ అయ్యింది. ఇప్పుడు శ్రుతి కూడా షోకి అంతే ప్లస్ అవుతుందని తమిళ బిగ్‌బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట.
అదే నిజమైతే వీకెండ్ ఎపిసోడ్ మంచి కలర్ఫుల్గా ఉండటం ఖాయం. బేసిగ్గా ఈ షోకి కమల్ హోస్ట్ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆ వాయిస్.. మాటలో కమాండ్.. తీక్షణమైన చూపులు.. నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడే తత్వం షోని సూపర్ హిట్ చేస్తున్నాయి. ఆయన కూతురు శ్రుతికి కూడా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం అలవాటు. కాబట్టి తండ్రి రేంజ్లో కాకపోయినా తనకి అప్పగించిన బాధ్యతకి చాలావరకు న్యాయం చేయగలదని నమ్మొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates