బ్ర‌హ్మి ఫ్యాన్స్.. ఇది చూడాల్సిందే

తెలుగు సినీ చ‌రిత్ర‌లో బ్ర‌హ్మానందంది ఒక ప్ర‌త్యేక అధ్యాయం. ఆయ‌నలా తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించిన క‌మెడియ‌న్ మ‌రొక‌రు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆ త‌రం ఈ త‌రం.. ఆ వ‌య‌సు, ఈ వ‌య‌సు అని తేడా లేకుండా అంద‌రినీ క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్వించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. దాదాపు మూడు ద‌శాబ్దాలు ఆప‌కుండా న‌వ్వించిన ఆయ‌న‌.. గ‌త కొన్నేళ్ల నుంచి తెర‌మ‌రుగైపోయారు.

వ‌రుస‌గా కొన్ని క్యారెక్ట‌ర్లు పండ‌క‌పోవ‌డం.. బ్ర‌హ్మితో వీర లెవెల్లో కామెడీ పండించిన శ్రీను వైట్ల లాంటి ద‌ర్శ‌కులు ఫాం కోల్పోవ‌డం.. బ్ర‌హ్మికి ఇంత‌కుముందులా మంచి పాత్ర‌లు రాసే ర‌చ‌యిత‌లూ క‌ర‌వ‌వ‌డం ఆయ‌న జోరు త‌గ్గ‌డానికి కార‌ణం. జాతిర‌త్నాలు లాంటి సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ త‌ళుక్కుమంటున్న‌ప్ప‌టికీ బ్ర‌హ్మి ఉనికి అయితే పెద్ద‌గా లేద‌నే చెప్పాలి. కానీ సోష‌ల్ మీడియాలో మీమ్స్ రూపంలో ఆయ‌న ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉంటున్నారు.

ఐతే సినిమాల్లో, బ‌య‌ట మాత్రం బ్ర‌హ్మి క‌నిపించ‌డం బాగా త‌గ్గిపోయింది. ఇలాంటి టైంలో బ్ర‌హ్మి ఒక సూప‌ర్ హిట్‌ ప్రోగ్రాంతో బుల్లితెర‌పై సంద‌డి చేయ‌డానికి రెడీ అయ్యారు. టీవీ షోల్లో మంచి ఆద‌ర‌ణ ఉన్న ఆలీతో స‌ర‌దాగా ప్రోగ్రాంలో బ్ర‌హ్మి అతిథిగా రానున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. బ్ర‌హ్మి ఒక‌ప్పుడు సినిమాల్లో ఎంత హ‌డావుడి చేసేవాడో.. అదే ఉత్సాహంతో ఈ ప్రోగ్రాంలో క‌నిపించారు. మోస్ట్ అవైటెడ్ గెస్ట్ అంటూ ఆయ‌న‌కు అదిరిపోయే ఇంట్రో కూడా ఇచ్చారు.

బ్ర‌హ్మి చిన్న పిల్లాడిలా చాలా ఉత్సాహంగా, అల్ల‌రిగా క‌నిపించి అభిమానులను ప్రోమోతోనే ఉర్రూత‌లూగించేశారు. అప్పుడే ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోతోంది. ఫుల్ ఎపిసోడ్లో బ్ర‌హ్మి ఆలీతో ఇంకెంత సంద‌డి చేస్తాడో.. త‌న అంత‌రంగాన్ని ఈ కార్య‌క్ర‌మంలో ఎలా ఆవిష్క‌రిస్తాడో అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 29న ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది.