ఆమిర్ ఖాన్ బిగ్ రిస్క్

బాహుబలి రానంత వరకు ఇండియన్ సినిమాలో బాలీవుడ్ వాళ్లదే ఆధిపత్యం. ఓవరాల్ కలెక్షన్ల విషయంలో హిందీ సినిమాలకు.. మిగతా భాషా చిత్రాలకు చాలా అంతరం ఉండేది. బడ్జెట్లు, పారితోషకాలు, బిజినెస్, వసూళ్లు.. ఇలా ఏ రకంగా చూసినా బాలీవుడ్‌ వాళ్లే పైచేయి సాధించేవాళ్లు. కానీ ‘బాహుబలి’తో అన్ని లెక్కలూ మారిపోయాయి. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ హిందీ సినిమాలకు గట్టి సవాలు విసిరింది.

ఈ కన్నడ సినిమా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై భారీ విజయాన్నందుకుంది. నార్త్ మార్కెట్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. దీంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులూ ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ ఆలస్యమవుతున్నా సరే రోజు రోజుకూ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.

‘కేజీఎఫ్-2’ను 2022 ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పోటీగా ఏ భాషలోనూ పేరున్న సినిమాలను రిలీజ్ చేయరనే అనుకున్నారు. కానీ హిందీలో ఓ భారీ చిత్రాన్ని ‘కేజీఎఫ్-2’కు పోటీగా నిలిపారు. ఆ చిత్రమే.. లాల్ సింగ్ చద్దా. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారం.

ఆమిర్ మాజీ మేనేజర్ అద్వైత్ చందన్ రూపొందించిన ఈ చిత్రం కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ముందు గత ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలనున్నారు. కానీ కరోనా ఫస్ట్ వేవ్ వల్ల వాయిదా తప్పలేదు. తర్వాత ఈ ఏడాది క్రిస్మస్‌కు డేట్ మార్చగా.. కరోనా సెకండ్ వేవ్‌తో మళ్లీ తేదీ మార్చక తప్పలేదు. ‘కేజీఎఫ్-2’ రిలీజ్ డేట్ ప్రకటించి చాలా రోజులైంది. ఈ సంగతి తెలిసి కూడా ఆమిర్ ఖాన్ దాంతో పోటీకి సై అంటున్నాడు. ‘కేజీఎఫ్-2’ను తక్కువ అంచనా వేస్తే ఆమిర్ సినిమాకు డ్యామేజ్ తప్పకపోవచ్చు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి డేట్ మార్చుకుంటుందేమో చూడాలి.