‘జాతిరత్నాలు’ చిట్టికి బంగారం లాంటి చాన్స్

జాతిరత్నాలు చిత్రంలో తన గ్లామర్‌‌తోనే కాక కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. తన హైట్‌తో ప్రభాస్‌నే ఆశ్చర్యపోయేలా చేసిన ఈ బ్యూటీకి ఇక తిరుగే ఉండదు అనుకున్నారంతా. అయితే మరో సినిమాతో ఆమె పేరు ముడిపడటానికి కాస్త ఎక్కువ సమయమే పట్టిందని చెప్పాలి. ఎట్టకేలకి ఓ మూవీలో హీరోయిన్‌గా చోటు దక్కించుకున్న ఫరియా.. ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్‌లోనూ చాన్స్‌ పట్టినట్టు తెలుస్తోంది.

నాగార్జున ‘బంగార్రాజు’లో ఓ స్పెషల్ నంబర్‌‌ చేయబోతోందట ఫరియా. ‘సోగ్గాడే చిన్నినాయనా’కి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. నాగ్‌కి జోడీగా రమ్యకృష్ణ, చైతుకి జంటగా కృతీశెట్టి కనిపించనున్నారు. నాగచైతన్య తప్ప మిగతా అందరి లుక్స్ రిలీజయ్యాయి. ఇంకా ఈ సినిమాలో చాలా స్పెషల్ రోల్స్ ఉంటాయట.

మొదటి పార్ట్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, కొద్దిగా రొమాంటిక్ టచ్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. ఈసారి మసాలాని కాస్త గట్టిగానే దట్టించే ప్రయత్నాల్లో ఉన్నాడట. అందులో భాగంగా రెండు మూడు స్పెషల్ సాంగ్స్ ఉంటాయని చెబుతున్నారు. వాటిలో ఒకటి ఫరియా బ్యాగ్‌లో పడిందని టాక్.

బేసిగ్గా ఫరియా మంచి డ్యాన్సర్. హిఫ్‌ హాప్, బీ బాయింగ్, బెల్లీ వంటి వాటిలో ఎక్స్‌పర్ట్. అందుకే తనకీ అవకాశం వచ్చిందట. అటు మంచి విష్ణుతో కలిసి ‘ఢీ’ సీక్వెల్‌లో హ్యూమర్, ఎమోషన్ కలగలిసిన హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది. ఇటు బంగార్రాజుతో స్టెప్పులేయడానికీ సిద్ధపడుతోంది. అంటే వచ్చిన మంచి అవకాశాల్ని తెలివిగా వాడుకుంటోందన్నమాట.