సుమంత్ దండ‌యాత్ర ఆగ‌ట్లేదు


అక్కినేని ఫ్యామిలీ ఘ‌న వార‌స‌త్వంతో రెండు ద‌శాబ్దాల కింద‌ట మంచి అంచ‌నాల‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు సుమంత్. తొలి సినిమాలో చూస్తే సుమంత్‌ ప్రామిసింగ్‌గా అనిపించాడు కానీ.. ఆ సినిమా స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో కెరీర్ ఆరంభంలోనే బ్రేక్ ప‌డింది. ఆ త‌ర్వాత కూడా కొన్ని సినిమాలు నిరాశ ప‌రిచాయి. అలాంటి టైంలో స‌త్యం సినిమాతో త‌నేంటో రుజువు చేసుకున్నాడు. ఈ సినిమా సుమంత్‌కు న‌టుడిగా పేరు తెచ్చింది. అలాగే మంచి విజ‌యాన్నీ అందించింది. కానీ త‌ర్వాత కూడా సుమంత్ కెరీర్లో ఒడుదొడుకులు త‌ప్ప‌లేదు.

గోదావ‌రి, మ‌ళ్ళీ రావా.. ఇలా ఎప్పుడో ఒక‌సారి ఓ హిట్టు కొట్ట‌డ‌మే త‌ప్ప నిల‌క‌డ‌గా ఎప్పుడూ విజ‌యాలు సాధించ‌లేదు సుమంత్. కొన్నేళ్ల కింద‌ట మ‌ళ్ళీ రావాతో గాడిన ప‌డ్డ‌ట్లే క‌నిపించినా.. మ‌ళ్లీ వ‌రుస ప‌రాజ‌యాల‌తో మార్కెట్ మొత్తం దెబ్బ తీసుకున్నాడు.

ఐతే ఎన్ని సినిమాలు నిరాశ ప‌రిచినా సుమంత్‌కు సినిమాలు మాత్రం ఆగ‌ట్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త చిత్రాలు లైన్లో పెడుతూనే ఉన్నాడు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి రిలీజ‌వుతూనే ఉన్నాయి. చివ‌ర‌గా ఈ ఏడాది సుమంత్ నుంచి వ‌చ్చిన క‌ప‌ట‌ధారి డిజాస్ట‌ర్ కావ‌డం తెలిసిందే. దీని త‌ర్వాత అత‌ను మ‌ళ్ళీ మొద‌లైంది అనే ఫ్యామిలీ ట‌చ్ ఉన్న ల‌వ్ స్టోరీ చేశాడు. అలాగే దీనికి భిన్నంగా అన‌గ‌న‌గా ఒక రౌడీ అంటూ మాస్ ఫిలిం చేశాడు. అవి రెండూ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఇంత‌లోనే సుమంత్ కొత్త సినిమా ఒకటి లైన్లోకి వ‌చ్చింది. అదే.. అహం-రీబూట్. ఇదొక కొత్త త‌ర‌హా థ్రిల్ల‌ర్ మూవీలా క‌నిపిస్తోంది. ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సోమ‌వార‌మే సినిమాను ప్ర‌క‌టించారు. ఇదే రోజు ప్రారంభోత్స‌వం కూడా జ‌రిగింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త జాన‌ర్ల‌లో సుమంత్ సినిమాలు సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ.. అత‌ను కోరుకున్న విజ‌యాలే ద‌క్క‌ట్లేదు. అహం-రీబూట్ అయినా అత‌డికి మంచి స‌క్సెస్ అందిస్తుందేమో చూడాలి.